ఆ ఫోటో ట్రంప్‌ కార్డ్... కానే కాదు!

August 02, 2024
img

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్, రిపబ్లికన్ అభ్యర్ధులుగా కమలా హారిస్‌, డొనాల్డ్ ట్రంప్‌ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇంతవరకు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయిన డొనాల్డ్ ట్రంప్‌, ఆమెపై పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. 

డొనాల్డ్ ట్రంప్‌ ఆమెపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలతో ఆమె కంటే ఆయనకే ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి.  

కమలా హారిస్ తండ్రి ఆఫ్రికన్, తల్లి భారతీయురాలు కావడంతో ఆమెకు ఇప్పుడు ప్లస్ పాయింట్‌గా మారింది. అమెరికాలో స్థిరపడ్డ ఇరుదేశాల ప్రజల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది.

దీంతో ట్రంప్‌ అమెరికాలోని నల్లజాతీయుల నుంచి వేరు చేయడానికి కొన్నేళ్ళ క్రితం ఆమె చెన్నైలోని తన అమ్మ తరపు బందువులతో చీరకట్టులో దిగిన ఫోటోని, ఆమె దిగిన ఫోటోని డొనాల్డ్ ట్రంప్‌ తన ‘ట్రూత్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, “చాలా ఏళ్ళ క్రితం ఇంత మంచి పంపినందుకు థాంక్స్ కమలా. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల, నువ్వు చూపిన ఈ ప్రేమాభిమానాలను అభినందిస్తున్నాను,” అంటూ వ్యంగ్యంగా మెసేజ్ పెట్టారు. 

అయితే ట్రంప్‌ అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి. ఆమె ఇరుదేశాల మూలాలు కలిగి ఉన్నారనే విషయం నల్లజాతీయులందరికీ తెలుసు. కనుక ఈ ఫోటో వారికేమీ అభ్యంతరం కాబోదు. 

కానీ ఈ ఫోటోతో అమెరికాలో స్థిరపడిన భారతీయులందరినీ ఆమె భారతీయ మూలాలు గుర్తించేలా చేసి, వారందరూ ఆమెకే ఓట్లు వేసేలా ట్రంప్‌ చేశారని చెప్పవచ్చు. పాపం ట్రంప్‌! 

Related Post