ఉషా చిలుకూరి మన తెలుగు బిడ్డే

July 18, 2024
img

అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్ధిగా జేడీ వేన్స్‌ని ఎంపిక చేయడంతో ఇంతవరకు ఎవరికీ పరిచయం లేని ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు భారత్‌లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోతోంది. 

ఆమె పూర్వీకులు చిలుకూరి బుచ్చి పాపయ్య శాస్త్రి ఏపీలో కృష్ణా జిల్లాలో సాయిపురంకు చెందినవారు. ఆమె తాతగారు చిలుకూరి రామశాస్త్రి మద్రాసు ఐఐటిలో ప్రొఫెసరుగా పనిచేసేవారు. 

ఆయన ముగ్గురు కుమారులలో ఒకరు రాధాకృష్ణ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ శాన్‌డియోగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకి చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారి సంతానమే ఉషా చిలుకూరి. 

ఉష మేనత్త శారద చెన్నైలో వైద్యురాలిగా చేస్తున్నారు. ఉష తాత ముత్తాతలు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నత విద్యావంతులు, మేధావులే కావడం విశేషం. 

ఆమె నాన్నమ్మ ప్రొఫెసర్ శాంతమ్మ విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఆమెకు 96 ఏళ్ళ వయసు. గత ఏడాది వరకు ఆమె ప్రతీరోజూ విశాఖ నుంచి విజయనగరం వెళ్ళి అక్కడ సెంచూరియన్ యూనివర్సిటీలో విద్యార్దులకు పాఠాలు బోధించేవారు. ఈ వయసులో కూడా ఆమె యూనివర్సిటీలోని రీసర్చ్ విద్యార్దులకు మార్గదర్శనం చేస్తున్నారు. 

తన మనుమరాలు ఉష కూడా ఉన్నత విద్యావంతురాలే కాని ప్రచారార్భాటలకు దూరంగా ఉంటుందని శాంతమ్మ చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె ప్రమేయం లేకుండానే ఆమె పేరు ఇంతగా మారుమ్రోగిపోతుండటం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆమెను విశాఖకు ఆహ్వానిస్తామని శాంతమ్మ చెప్పారు.

Related Post