అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు

July 14, 2024
img

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శుక్రవారం సాయంత్రం పెన్సెల్వేనియా రాష్ట్రంలో బట్లర్ అనే ప్రాంతంలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ట్రంప్ చెవికి గాయం అయ్యింది. వెంటనే భద్రత సిబ్బంది ట్రంప్‌ని అక్కడి నుంచి అంబులెన్సులో హాస్పిటల్‌కు తరలించారు. ట్రంప్ సభకు హాజరైన వారిలో ఒకరు ఈ కాల్పులలో మరణించిన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా సిబ్బంది పట్టుకునే ప్రయత్నం చేయగా అతను వారిపై కూడా కాల్పులు జరపడంతో వారు అతనిని కాల్చి చంపారు. ట్రంప్ చెవికి గాయం తప్ప పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు. 

ట్రంప్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు చాలా దారుణమన్నారు. ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ దాడిపై విచారణ జరిపి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అమెరికా సీక్రెట్ సర్వీస్ తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. 

డెమొక్రేటిక్ పార్టీ అభ్యర్ధిగా మళ్ళీ జో బైడెన్ పోటీ చేస్తుండగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు.       


Related Post