ఆ విమానంలో 45 మంది భారతీయుల మృతదేహాలు

June 14, 2024
img

కువైట్‌లోని అల్ మంగాఫ్ పట్టణంలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 49 మంది సజీవ దహనం అయ్యారు. వారిలో 45 మంది భారతీయులే. వారి మృతదేహాలను గుర్తించలేనంతగా కాలిపోయాయి. 

ఓ ప్రైవేట్ కంపెనీలో వారందరూ కార్మికులుగా పనిచేస్తూ ఆ కంపెనీ ఏర్పాటు చేసిన భవనంలో ఉండేవారు. అందరూ నిద్రపోతున్న సమయంలో హటాత్తుగా వంటగదిలో నుంచి మంటలు మొదలై క్షణాలలో భవనం అంతటా కమ్ముకున్నాయి. 

దాంతో ఏమి జరుగుతోందో తెలుసుకునేలోగానే చాలా మంది అగ్నికి ఆహుతి అయిపోయారు. కొంతమంది తప్పించుకోబోయి దట్టమైన పొగాకు ఊపిరి ఆడక మెట్లపైనే చనిపోయారు. అతికొద్ది మంది మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడగలిగారు. 

మృతులలో 23 మంది కేరళ, 11 మంది యూపీ, ఏడుగురు తమిళనాడు, ముగ్గురు ఏపీ, ఒకరు కర్ణాటకకు చెందినవారు. 

ఈ ఘటనపై వెంటనే స్పందించిన కేంద్రమంత్రి కీర్తివర్ధన్‌ను కువైట్ పంపించి, భారత్‌ ప్రభుత్వం వాయుసేనకు చెందిన విమానంలో వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించింది. 

45 మంది మృతదేహాలతో వాయుసేన విమానం ఈరోజు ఉదయం కేరళలో లోని కోచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నప్పుడు మృతుల బంధువుల ఆక్రందనలను చూసి అందరూ కంట తడి పెట్టారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపీ తదితరులు విమానాశ్రయంలో వారిని ఓదార్చారు.

Related Post