భారత్‌ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించుకుంది కానీ పాకిస్తాన్...

June 13, 2024
img

పాకిస్తాన్‌లో అధికార, ప్రతిపక్షా నాయకులు అందరూ నేటికీ భారత్‌ని శతృదేశంగానే పరిగణించి మాట్లాడుతుంటారు. కానీ వారే తమ సెనేట్ (పార్లమెంట్‌)లో భారత్‌ అభివృద్ధి గురించి, అంతరిక్ష ప్రయోగాల గురించి వర్ణిస్తూ, పాకిస్తాన్ ఆవిదంగా ఎందుకు ఎదగలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. 

తాజాగా పాక్ సెనేట్‌ సమావేశాలలో ప్రతిపక్ష పిటిఐ నాయకుడు సిబిల్ ఫరాజ్ మాట్లాడుతూ, “ఇటీవలే భారత్‌లో ఎన్నికలు జరిగాయి. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారి కోసం వారి ఈసీ లక్షల ఈవీఎంలను ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాలలో ఒకే ఒక్క ఓటరు ఉన్న చోట కూడా ఈవీఎం ఏర్పాటు చేసి ఓటు వేసేలా చర్యలు తీసుకుంది. 

భారత్‌లో సుమారు నెలరోజుల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియలో కోట్లాదిమంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు. మన శతృదేశమైన భారత్‌ని నేను ఉదాహరణగా చెప్పడం లేదు. కానీ మనకంటే చాలా ఎక్కువ జనాభా ఉన్న భారత్‌లో ఇంత చక్కగా ఎన్నికలను నిర్వహించుకుంటుంటే, మన దేశంలో ఎన్నడూ ఎన్నికలు సజావుగా నిర్వహించుకోలేకపోతున్నాము? అని సిబిల్ ఫరాజ్ ప్రశ్నించారు. 

ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు చాలా హింసాత్మక ఘటనలు, విధ్వంసం, రిగ్గింగ్ జరిగాయి. ఆ ఎన్నికలలో పిటిఐ పార్టీకి ఎక్కువ సీట్లు లభించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకి సరిపడా మెజార్టీ రాకపోవడంతో ప్రతిపక్షానికి పరిమితం కావలసి వచ్చింది. ప్రస్తుతం పీపీపీ, షాబాజ్ షరీఫ్ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. 


Related Post