పంజాబీ క్యాబ్ డ్రైవర్ కి ఆస్ట్రేలియన్ అవార్డు

November 09, 2016
img

అతని పేరు తేజేందర్ పాల్ సింగ్. చాలా మంది భారతీయులలాగే అతను కూడా ఉజ్వల భవిష్యత్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. అక్కడ టాక్సీ (క్యాబ్) డ్రైవర్ గా స్థిరపడ్డాడు. పదేళ్ళుగా అదే పని చేస్తున్నాడు. అంతవరకే అయితే అందులో వింతేమీ లేదు. కానీ అతను ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నికయ్యాడు. అదే విశేషం. ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ అంత అత్యున్నత పురస్కారానికి ఏవిధంగా ఎంపిక అయ్యాడంటే దానికో కధ ఉంది. పంజాబ్ నుంచి ఆస్ట్రేలియా వస్తున్న వారందరూ చివరికి క్యాబ్ డ్రైవర్స్ గా మారుతుంటారని ఒక ప్యాసింజర్ చులకనగా మాట్లాడాడు.

అదే తేజేందర్ ని ఆలోచింపజేసింది. తన పరిధిలో తానేమీ చేయగలనని ఆలోచించి, సమాజసేవ చేయడం మొదలుపెట్టాడు. డార్విన్ ఉత్తరప్రాంతంలో చాలా మంది నిరుపేదలు నివసిస్తుండటం గమనించాడు. వారు తినడానికి ఆహారం కూడా దొరకని దుర్బర దారిద్ర్యం అనుభవిస్తున్నట్లు గుర్తించాడు. అప్పటి నుంచి నెలలో ఒకరోజు ఆదివారంనాడు తను సంపాదించిన డబ్బుతో వారికి ఆహారం తయారుచేయించి తీసుకువెళ్ళి పంచిపెట్టి వస్తుంటాడు. గత 4 సం.లుగా అతను ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. అతనిని చూసి మరో మూడు బృందాలు కూడా అటువంటి సేవాకార్యక్రమాలు మొదలుపెట్టాయి.

తేజేందర్ ని అక్కడి ప్రజలందరూ పాల్ (స్నేహితుడు) అని ప్రేమగా పిలుచుకొంటారు. అతను చేస్తున్న సేవలని ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా గుర్తించింది. ప్రతీ ఏటా ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో భాగంగా ఈవిధంగా స్థానికులకి సేవలు అందిస్తున్న వారికి ‘లోకల్ హీరో’ అనే అవార్డు ఇస్తుంటుంది. ఈసారి ఆ అవార్డు మన తేజేందర్ పాల్ సింగ్ కి ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అతనికి 2017, జనవరి 25వ తేదీన ఆ అవార్డు ప్రధానం చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

Related Post