అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్ధి అదృశ్యమయ్యాడు. హన్మకొండకు చెందిన చింతకింది రూపేష్ చంద్ర చికాగోలో విస్కాన్సిన్ అనే ప్రాంతంలో గల కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. చివరిసారిగా ఈ నెల 2వ తేదీన తండ్రితో ఫోన్‌లో మాట్లాడాడు.
ఆ తర్వాత రోజు నుంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుండటంతో రూపేష్ తల్లితండ్రులు అతని స్నేహితులకు ఫోన్ చేయగా వారు అతని గురించి వెతికారు. కానీ రూపేష్ ఆచూకీ తెలియలేదు. దీంతో రూపేష్ తండ్రి స్థానిక ఎమ్మెల్యే ద్వారా భారత్ విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి విషయాన్ని తెలియజేసి కొడుకు ఆచూకీ కనుగొనవలసిందిగా కోరారు. అమెరికాలో భారత్ కౌన్సిలేట్ అధికారులు వెంటనే స్పందించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు, రూపేష్ స్నేహితులు, స్థానికంగా నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు వారం రోజులుగా రూపేష్ కోసం గాలిస్తున్నారు. కానీ ఇంతవరకు ఆచూకీ తెలియకపోవడంతో రూపేష్ తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.