“భారత్, పాక్ దేశాలు రెండూ ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో స్వాతంత్ర్యం పొందాయి. కానీ ఈ ఏడున్నర దశాబ్ధాలలో భారత్ ఎంతగానో అభివృద్ధి సాధించి ‘సూపర్ పవర్’గా ఎదిగి అగ్రదేశాల సరసన నిలబడేందుకు సిద్దం అవుతుంటే, పాకిస్తాన్ దివాళా తీయకుండా ఉంటే చాలనుకునే దుస్థితిలో ఉంది.
భారత్ చంద్రయాన్, జీ20 సదస్సులు నిర్వహిస్తుంటే పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పులు ఆడుక్కుంటోంది. భారత్ అలా పాకిస్తాన్ ఇలా ఎందుకున్నాయి?” అని పాకిస్తాన్‌లో ప్రతీ ఒక్కరూ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. అయితే అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ పాకిస్తాన్ అసెంబ్లీ (పార్లమెంట్)లో ఈ ప్రశ్న అడగడమే వార్త అయ్యింది.
పాకిస్తాన్ ఈ దుస్థితిలో ఉండటానికి కారణం అందరి కంటే ఆయనకే బాగా తెలిసి ఉండాలి. పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ పట్ల ద్వేషంతో రగిలిపోతూనే ఉంది. ఆ ద్వేషంతో ఉగ్రవాదులను తయారుచేసి భారత్‌పైకి పంపిస్తూనే ఉంది తప్ప తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని పాక్ పాలకులు ఏనాడూ అనుకోలేదు.
ఒకవేళ ఎవరైనా అనుకున్నా మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ అతివాదులు, పాకిస్తాన్ సైన్యాధికారులు, ఉగ్రవాదులు వారిని ముందుకు సాగనీయలేదు. భారత్ కోసం సృష్టించిన ఉగ్రవాదమే చివరికి పాకిస్తాన్ని నాశనం చేస్తోంది.
వీటన్నిటికీ తోడు పాక్ పాలకుల అవినీతి, దురాశ, దేశభక్తి అంటే కశ్మీర్ సమస్య అన్నట్లే ఆలోచించడం వంటి అనేక అవలక్షణాలు పాకిస్తాన్‌ను చివరికి ఈ దయనీయ స్థితిలో నిలబెట్టాయని ఆ దేశంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు.
అయితే పాకిస్తాన్ కంటే చాలా కటినంగా ఇస్లాం మతాచారాలను పాటించే సౌదీ అరేబియా కూడా కాలానుగుణంగా తమ ఆలోచనలలో, విధానాలలో మార్పులు చేసుకుంటూ, చాలా క్రమశిక్షణతో ఏవిదంగా అభివృద్ధిపధంలో దూసుకుపోతోందో చూస్తే పాకిస్తాన్ చేస్తున్న తప్పు ఏమిటో అర్దమవుతుంది.
కనుక ఇప్పటికైనా పాక్ పాలకులు, సైన్యాధికారులు, మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ వంటి అతివాదులు తమ ఆలోచనలు, విధానాలు మార్చుకుంటే, భారత్‌తో సహా ప్రపంచదేశాలు సాయపడేందుకు సిద్దంగానే ఉన్నాయని తెలుసుకుంటే మంచిది.
ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు భారత్ ఎంతగా సాయపడిందో అందరికీ తెలుసు. అటువంటిది ఒకప్పుడు మన దేశంలో భాగంగా ఉన్న పాకిస్తాన్ మారేందుకు సిద్దపడితే సాయం చేయకుండా ఉంటుందా?
కానీ పాక్ పాలకుల ఆలోచనలు మారవు కనుక పాకిస్తాన్ ఎన్నటికీ బాగుపడక పోవచ్చు. ఇది ఆ దేశ ప్రజల దౌర్భాగ్యమే కదా?