పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవారు ఎవరూ కూడా ఆ దేశాన్ని మార్చలేరు... అభివృద్ధి చేయలేరు. కానీ పదవీ కాలం ముగిసిన తర్వాత లేదా ముందుగానే దేశం విడిచి పారిపోతుంటారు. పారిపోకపోతే ఏదో ఓ కేసులో జైలు శిక్షో, ఉరి శిక్షో తప్పక పడుతుంది. ఈ రెండూ కాకపోతే ఉగ్రవాదులో, మరొకరో ఆత్మహుడి దాడి చేసి చంపేస్తారు. పాకిస్తాన్ ప్రధానిగా ఎవరు చేసినా ముగింపు మాత్రం ఇలాగే ఉంటుంది.
ఆ జాబితాలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చేరారు. సైఫర్ కేసుగా పేరొందిన కేసులో ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన నేరానికి ఆయనకు న్యాయస్థానం పదేళ్ళు జైలు శిక్ష విధించింది. ఆయన ప్రధానిగా ఉన్నపుడు వాషింగ్‌టన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం పంపిన ఓ దౌత్యపరమైన సందేశాలను ఆయన బహిర్గతం చేశారనే నేరంపై సుదీర్గ విచారణ తర్వాత దోషిగా నిర్ధారించి పదేళ్ళు జైలు శిక్ష విధించింది.
ఆయన అంతకు ముందు నుంచే అంటే గత ఏడాది ఆగస్ట్ నుంచే తోషాఖానా కేసులో మూడేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ రెండూ కాక ఆయనపై ఇంకా చాలా కేసులున్నాయి. కానీ ఈ రెండు కేసులలోనే ఆయనకు 13 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన వయసు 73 ఏళ్ళు అంటే శేషాజీవితం జైల్లోనే గడపాల్సి వస్తుందేమో?