చంద్రుడిపై భారత్‌... అప్పుల ఊబిలో పాకిస్తాన్: నవాజ్ షరీఫ్

September 20, 2023
img

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ దేశ దుస్థితిని చూసి బాధపడుతూ “భారత్‌ చంద్రుడిని చేరింది. ఘనంగా జీ20 సదస్సు కూడా నిర్వహించింది. కానీ పాకిస్తాన్ మాత్రం అప్పుల కోసం చైనా, అరబ్ దేశాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. పాకిస్తాన్ దుస్థితికి కారణం ఎవరు? 

అటల్ బిహారీ వాజ్‌పేయి భారత్‌ ప్రధాని అయినప్పుడు భారత్‌ వద్ద కేవలం ఒక్క బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండేవి. కానీ ఇప్పుడు భారత్‌ వద్ద 600 బిలియన్ డాలర్లున్నాయి. భారత్‌ ఆ స్థాయికి ఎలా చేరింది? ప్రపంచదేశాలను అడుక్కొనే దుస్థితికి పాకిస్తాన్ ఎందుకు దిగజారింది?అని ప్రశ్నిస్తూ కొందరు న్యాయమూర్తులు, మాజీ సైనిక జనరల్స్ దీనికి కారణమని ఆయనే జవాబు చెప్పారు.

గమ్మతైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ దుస్థితికి ఆయన కూడా కారకుడే. అవినీతి కేసులలో జైలు శిక్ష అనుభవిస్తూ వైద్యం కోసమని కోర్టు అనుమతితో లండన్ వెళ్ళి అక్కడే ఉండిపోయారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాహోర్‌లో జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 

పాకిస్థాన్‌లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ దాని సైనిక జనరల్స్, పాకిస్తాన్ గూఢచారి సంస్థ (ఐఎస్ఎస్) అధినేతల కనుసన్నలలో పనిచేయవలసి వచ్చేది. దాంతో వారు భారత్‌ పట్ల విద్వేషం, దాని కోసం ఉగ్రవాదం దేశవిధానంగా మార్చేసుకొన్నారు. 

ప్రధాని పదవి ముగిసేలోగా లేదా తర్వాత జైలు లేదా ఉరి శిక్షలు తప్పేవి కావు. కనుక ప్రధానిగా ఉన్నప్పుడే భారీగా అవినీతికి పాల్పడుతూ విదేశాలలో ఆ డబ్బు దాచుకొని అవకాశం చిక్కగానే దేశం విడిచి పారిపోతుండటం పరిపాటిగా మారిపోయింది. నవాజ్ షరీఫ్ కూడా అదే చేశారు. ఈవిదంగా ఉంటే ఏ దేశమైన ఎలా బాగుపడుతుంది?అందుకు ఎవరినో నిందించి ఏం ప్రయోజనం? 

Related Post