పిడుగుపడి అమెరికాలో భారతీయ విద్యార్ధిని కోమాలోకి

July 21, 2023
img

అమెరికాలో ఉన్నత విద్యలభ్యసించడానికి వెళ్ళిన భారతీయ విద్యార్ధిని సుశ్రూణ్య కోడూరు (25) జీవితం ఒక్క నిమిషంలో విషాదంగా మారిపోయింది. ఆమె హ్యూస్టన్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో మాస్టర్స్ చేస్తోంది. 

జూలై 2వ తేదీన తన స్నేహితులతో కలిసి నగరంలోని చారిత్రిక పర్యాటక ప్రాంతం శాన్ జాకింటో బ్యాటిల్ గ్రౌండ్‌కు వెళ్ళి అక్కడే ఉన్న చెరువు పక్క నుంచి నడుస్తున్నప్పుడు, స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 5.40 గంటలకు ఆమెపై పిడుగు పడింది. ఆ ధాటికి ఆమె పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. అది చూసి అక్కడే ఉన్న ఆమె స్నేహితులు వెంటనే చెరువులో దిగి ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చి హాస్పిటల్‌కు తరలించారు. 

ఆమె పిడుగుపాటుకు గురైనప్పుడు ఆమె బ్రెయిన్ దెబ్బ తినడంతో కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉంది. ఆమె ఊపిరి పీల్చుకోలేకపోతుండటంతో అప్పటి నుంచి హాస్పిటల్లో వెంటిలేటర్‌పై ఉంచి కృత్రిమశ్వాస అందిస్తున్నారు. ఆమె బ్రెయిన్ దెబ్బ తినడంతో ఆ ప్రభావం ఆమె అంతర్గత అవయవాల పనితీరుపై కూడా పడింది. 

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఇంకా ఎప్పటికీ కోమాలో నుంచి బయటకు వస్తుందో, కోమా నుంచి బయటపడిన తర్వాత ఆమె ఇదివరకులా జీవించగలుగుతుందో లేదో తెలీని పరిస్థితి. 

అమెరికాలో భారతీయులు ఆమె వైద్యం కోసం ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. చికిత్స కొరకు 400,000 డాలర్స్ అవసరం ఉండగా ఇప్పటివరకు 129,000 డాలర్స్ సేకరించగలిగారు. 

ఆమె తల్లితండ్రులు సామాన్య మద్యతరగతి కుటుంబానికి చెందినవారు కావడంతో కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి శోకిస్తున్నప్పటికీ అమెరికా వెళ్ళేందుకు ఆర్ధిక స్థోమత లేక హాస్పిటల్లో చావుబ్రతుకుల్లో ఉన్న కూతురుని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికా వెళ్ళేందుకు వారి బంధు మిత్రులు కూడా విరాళాలు సేకరిస్తున్నారు. 



Related Post