అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐదుగురు గల్లంతు

June 22, 2023
img

అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. దశాబ్ధాల క్రితం ఆ సముద్రంలో టైటానిక్ షిప్ మునిగిపోయింది. సుమారు 12,000 అడుగుల లోతులో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిధిలాలను చూసేందుకు వారు ‘ఓషన్ గేట్ టైటాన్’ అనే ఓ మినీ జలాంతర్గామిలో అమెరికాలోని న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి ఆదివారం బయలుదేరారు. 

అయితే సముద్రంలో ప్రవేశించిన కొన్ని గంటల తర్వాత వారి జలాంతర్గామి కూడా గల్లంతయింది. దానిలో పాకిస్తాన్‌కు చెందిన షెహజదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో స్తిరపడిన బ్రిటిష్ వ్యాపారవేత్త హామీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు స్టాక్టన్ రాష్, ఫ్రెంచ్ నావికాధికారి పాల్ హెన్రీ ఉన్నారు. 

టైటాన్ జలాంతర్గామి కమ్యూనికేషన్ సిగ్నల్స్ నిలిచిపోవడంతో అమెరికా, కెనడా దేశాల నావికాదళాలు గాలింపు మొదలుపెట్టాయి. అయితే నాలుగు రోజులైనా ఇంతవరకు దాని ఆచూకీ కనిపెట్టలేకపోయాయి. టైటాన్ జలాంతర్గామిలో ఈరోజు ఉదయం వరకు మాత్రమే సరిపడా ఆక్సిజన్ నిలువ ఉందని సదరు పర్యాటక సంస్థ ప్రతిధులు చెప్పారు. కనుక ఒకవేళ సముద్రగర్భంలో చిక్కుకొని ఉంటే వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండకపోవచ్చు. 

కెనడాకు చెందిన పి-8 నిఘా విమానం సముద్రం అడుగు నుంచి ప్రతీ అరగంటకు కొన్ని శబ్ధాలు వెలువడుతున్నట్లు గుర్తించి అమెరికన్ నావికాదళానికి తెలియజేసింది.  బహుశః అవి టైటాన్ జలాంతర్గామి నుంచి వెలువడుతున్న సంకేతాలే కావచ్చని భావిస్తున్నారు. కనుక అమెరికా నావికాదళం సబ్ మెరైన్‌తో అక్కడకు చేరుకొనేందుకు ప్రయత్నిస్తోంది.

Related Post