వాషింగ్‌టన్ డీసీవైపు వచ్చిన పాపానికి...

June 05, 2023
img

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక నివాసం ఉండే వాషింగ్‌టన్ డీసీలో గగనతలంపై అమెరికా వాయుసేన పటిష్టమైన నిఘా ఉంటుంది. కనుక అక్కడ గగనతలంలో అన్ని విమానాలు, హెలికాఫ్టర్లు నిర్ధిష్టమైన మార్గంలోనే తప్పనిసరిగా ప్రయాణించవలసి ఉంటుంది. పొరపాటున పక్కకు మళ్ళితే అమెరికా వాయుసేనకు చెందిన అత్యాధునిక యుద్ధవిమానాలు గాలిలో లేచి వాటిని వెంటాడుతాయి. 

అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం అటువంటి ఘటనే జరిగింది. టెన్నిసీ నగరంలోని ఎలిజబెత్ టౌన్‌లోని విమానాశ్రయం నుంచి ఓ బిజినెస్ జెట్ న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్‌కు బయలుదేరింది. కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఆ విమానం హటాత్తుగా దిశ మార్చుకొని వాషింగ్‌టన్ డీసీవైపు ప్రయాణించడం ప్రారంభించింది. 

వెంటనే వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం గాలిలో లేచి దానిని వెంబడించింది. యుద్ధవిమానం పైలట్ ఆ బిజినెస్ జెట్ పైలట్‌ను హెచ్చరిస్తున్నప్పటికీ అటునుంచి స్పందన రాలేదు. కొన్ని నిమిషాలకు ఆ రెండు విమానాలు వర్జీనియా సమీపంలోని ఓ అటవీ ప్రాంతం వద్దకు చేరుకొన్నప్పుడు, బిజినెస్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. 

దానిని అమెరికా యుద్ధ విమాన పైలట్ కూల్చివేశాడా లేక 30 వేల అడుగులో ఎగురుతున్న విమానాన్ని పైలట్ కిందకు దించే ప్రయత్నం చేయడం వలన చెట్లను ఢీకొని కూలిపోయిందా? అనేది తెలియవలసి ఉంది. 

ఆ బిజినెస్ జెట్ ఫ్లోరిడాలోని ఎన్‌కోర్ మోటార్స్ అధినేత జార్ రాంపెల్‌కు చెందినది. దానిలో తన కుమార్తె, రెండేళ్ళు వయసున్న మనుమరాలు మాత్రమే ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. వారు తనను చూసేందుకు ఫ్లోరిడా వచ్చి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నారని చెప్పారు. పైలట్ ఆవిదంగా ఎందుకు దిశ మార్చుకొన్నాడో తనకు తెలియదని కానీ తన కూతురు, మనుమరాలు బలైపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.                 


Related Post