అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ ప్రాంగణంలోనికి సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు ఓ తెలుగు యువకుడు ఓ వాహనంతో దూసుకుపోయేందుకు ప్రయత్నించగా, భద్రతాదళాలు అడ్డుకొని అరెస్ట్ చేశాయి. ఆ కుర్రాడి పేరు సాయి వర్షిత్ కందుల. వయసు 19 ఏళ్ళే. అతను మిస్సౌరీలోని చెస్టర్ ఫీల్డ్ వద్ద నివాసం ఉంటున్నట్లు, 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి డిగ్రీ పూర్తి చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు.
అతను వైట్‌హౌస్ ఉత్తర భాగంవైపు గల లాఫాయేట్ పార్క్ సమీపంలో హెచ్ స్ట్రీట్ 1600 బ్లాకులోని బొలార్డ్ లోకి యూహాల్ అని వ్రాసున్న మినీ ట్రక్కుతో బారికేడ్లను గుద్దుకొంటూ దూసుకుపోతుంటే భద్రతాదళాలు అతనిని నిలువరించి అరెస్ట్ చేశాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆ ట్రక్కుకు స్వస్తిక్ గుర్తు కలిగిన జండా కట్టి ఉంది.
ఈవిదంగా ఎందుకు చేశావని పోలీసులు అతనిని ప్రశ్నించగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లను హత్య చేసేందుకే అని చెప్పడంతో ఆ నేరానికి, వైట్‌హౌస్ ప్రాంగణంలోనికి అనుమతి లేకుండా ప్రవేశిచేందుకు ప్రయత్నించినందుకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు పోలీసులు సాయి వర్షిత్ కందులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సాయి వర్షిత్ కందుల పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.