భారత్‌లో ఏటా లక్షలాదిమంది అమెరికా వెళ్ళి చదువుకోవాలనో, అక్కడ ఉద్యోగం సంపాదించుకొని దర్జాగా జీవించాలనో కలలుగంటూ అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ పరిమిత సంఖ్యలో జారీ చేయబడే అమెరికా వీసాకు చాలా పోటీ ఉంటుంది. అదీగాక వీసా పొందడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అన్నీ సవ్యంగా ఉన్నా చివరిగా కౌన్సిలేట్ అధికారుల ఇంటర్వ్యూ మరో అగ్నిపరీక్ష. అందులో కూడా ఉత్తీర్ణులైతే తప్ప అమెరికాలో అడుగుపెట్టలేరు.
ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకొనే వారికి ఓ శుభవార్త! అన్ని పత్రాలు సవ్యంగా ఉంటే ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే వీసాలు జారీ చేయాలని అమెరికా వీసా మరియు ఇమ్మిగ్రేషన్ శాఖ నిర్ణయించింది. కానీ ఈ ఏడాది డిసెంబర్ 31వరకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.
వీసాలలో టూరిస్ట్, ఎడ్యుకేషన్, ఉద్యోగాలకు, కుటుంబాలకు వేర్వేరుగా వీసాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వాటన్నిటికీ ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చింది. వాటిలో బీ1 (బిజినెస్ కేటగిరీ), బీ2 (పర్యాటకం), అకాడమిక్-జె, హెచ్-1, హెచ్-3, హెచ్-4, ఎఫ్, ఎల్, ఎం, ఓ, పీ, క్యూ వీసాలకు ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వీసా గడువు ముగిసిన నాలుగేళ్ళలోపు రెన్యూవల్ చేయించుకొనేవారికి కూడా ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు లభిస్తుంది. గతంలో ఈ వీసాలు పొందేందుకు ప్రయత్నించి తిరస్కరణకు గురైనవారికి మాత్రం ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది.
కరోనా, లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో అన్ని అమెరికన్ కౌన్సిలేట్ కార్యాలయాలలో వేలాదిగా దరఖాస్తులు పెండింగులో ఉండిపోయాయి. కనుక ఇప్పటికే వీసాల కోసం దరఖాస్తు ఫీజు చెల్లించినవారు 2023 సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా తమ వీసా దరఖాస్తులను పునరుద్దరించుకోవచ్చునని అమెరికా వీసా మరియు ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది.