భారత్‌కు చెందిన ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీపై శుక్రవారం న్యూయార్క్ నగరంలో హత్యాయత్నం జరిగింది. శుక్రవారం రాత్రి ఆయన ఓ సభలో వేదికపై ప్రసంగిస్తుండగా హటాత్తుగా హదీ మటర్ (24) అనే ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పలుమార్లు పొడిచాడు.
ఈ దాడిలో సల్మాన్ రష్దీ చాలా తీవ్రంగా గాయపడ్డారు. సభ నిర్వాహకులు వెంటనే ఆయనను ఎయిర్ అంబులెన్సులో హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు పలు శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ఆయన చేతి నరాలు తెగిపోగా కాలేయం కూడా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. ఒకవేళ ఆయన కోలుకొన్నప్పటికీ ఒక కన్ను కోల్పోవచ్చని వైద్యులు తెలిపారు.
సల్మాన్ రష్దీ దైవ దూషణకు పాల్పడినందుకు ఆయనను చంపినవారికి రూ.23.88 కోట్లు బహుమతిగా ఇస్తానని ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖోమైనీ గతంలో ప్రకటించారు. దాంతో అప్పటి నుంచి సల్మాన్ రష్దీ అజ్ఞాతంలోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు హాజరయినా అనేక జాగ్రత్తలు తీసుకొంటుంటారు. కానీ ఈసారి దాడి నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయనపై దాడి చేసిన వ్యక్తి న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూకి చెందిన హదీ మటర్‌గా న్యూయార్క్ పోలీసులు గుర్తించారు.