అమెరికాలో నల్గొండ యువకుడు మృతి

June 22, 2022
img

అమెరికాలో మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పులలో నల్గొండ జిల్లాకు చెందిన సాయి చరణ్ నక్కా (26) మృతి చెందాడు. మొన్న ఆదివారం సాయంత్రం తన కారులో స్నేహితుడిని విమానాశ్రయంలో దించి తిరిగి బయలుదేరుతుండగా అకస్మాత్తుగా ఓ నల్లజాతీయుడు తుపాకీతో అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడిన సాయి చరణ్‌ను పోలీసులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా దారిలోనే చనిపోయినట్లు సమాచారం. 

సాయి చరణ్ రెండేళ్ళ క్రితం అమెరికాకు వెళ్ళి అక్కడ సిన్సినాటి యూనివర్శిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. తరువాత అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించుకొని ఇటీవలే ఓ కారు కూడా కొనుకొన్నాడు. ఉద్యోగంలో స్థిరపడుతుండటంతో నవంబర్‌లో సెలవు తీసుకొని స్వదేశానికి రావాలనుకొన్నాడని సాయి చరణ్ తండ్రి నర్సింహ చెప్పారు. చివరిసారిగా శుక్రవారం సాయంత్రం ఫోన్‌ చేసి కొడుకుతో మాట్లాడమని, ఇక నుంచి తమ బాగోగులు తానే చూసుకొంటానని చెప్పి తమ బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే పంపించామని నర్సింహ చెప్పారు. నవంబర్‌లో ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళి సంబంధాలు చూద్దామని ఆలోచిస్తుండగా ఇంతలోనే ఈవిదంగా తమ కుమారుడి జీవితం అర్దాంతరంగా ముగిసిపోయిందని తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related Post