ఉక్రెయిన్‌ దాడి గురించి ముందే హెచ్చరించాం కానీ...

June 11, 2022
img

ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తెల్లవారుజామున ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది. సుమారు నాలుగు నెలలయినా ఇంకా ఉక్రెయిన్‌పై దాడులు ఆపలేదు. ఇంకా ఎంత కాలం యుద్ధం సాగిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితులు. ఒకవేళ ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకొన్నా శిధిలాల దిబ్బగా, శ్మశానంలా నిర్మానుష్యంగా మారిన ఆ దేశాన్ని రష్యా ఏమి చేసుకొంటుందో తెలీదు. కానీ ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ లాస్ ఏంజిలిస్ నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయబోతోందని మేము ముందే హెచ్చరించాము. కానీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సహా ఎవరూ నమ్మలేదు. అసలు మేము చెప్పింది వినడానికే ఎవరూ ఇష్టపడలేదు. కానీ మేము చెప్పింది నిజమని గ్రహించేలోగా రష్యా దళాలు ఉక్రెయిన్‌లోకి చొచ్చుకు వచ్చేశాయి. ఈ సమస్య నుంచి ఉక్రెయిన్‌ బయటపడేందుకు అమెరికా యధాశక్తిన సహాయసహకారాలు అందిస్తోంది. కానీ ఈ యుద్ధం వలన దెబ్బ తిన్న ఉక్రెయిన్‌ కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందని మాకు తెలుసు,” అని అన్నారు. 

ఉక్రెయిన్‌పై ఎవరు దాడి చేసినా వచ్చి బాసటగా నిలుస్తామని అమెరికాతో సహా నాటో దేశాలు భరోసా ఇవ్వడం వలననే ఉక్రెయిన్‌ పాలకులు వాటి మాటలు నమ్మి తమ దేశంలో ఉన్న అణ్వాయుధాలన్నిటినీ నిర్వీర్యం చేశారు. కానీ ఉక్రెయిన్‌ఐ రష్యా నాలుగు నెలలుగా దాడులు చేస్తూ వేలాదిమంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకొంటుంటే ఏ ఒక్క దేశం రష్యాను ఢీకొనడానికి సాహసించలేదు. ఒకవేళ ఉక్రెయిన్‌ వద్ద ఆ అణ్వాయుధాలే ఉన్నట్లయితే రష్యా ఇటువంటి దుస్సాహసానికి పూనుకొనేదే కాదు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్‌ శిధిలమైపోయింది. ఇకనైనా రష్యా విడిచిపెడితే మళ్ళీ దేశాన్ని పునర్నిర్మించుకోవలసి ఉంటుంది. దీనికి ఎన్ని దశాబ్ధాలు పడుతుందో.. అసలు ఎప్పటికైనా కోలుకోగలదో లేదో కూడా తెలీదు.

Related Post