మేము బాంబులు కురిపిస్తుంటాం...ఎవరూ అడ్డుకోవద్దు

June 06, 2022
img

గత మూడు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీరోజు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. దాంతో ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా శిథిలాలు తప్ప మరేవీ కనిపించడం లేదిప్పుడు. రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి నేటి వరకు కోటిన్నర మందికి పైగా పౌరులు పొరుగు దేశాలకు తరలిపోయారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్య కాంక్ష, యుద్ధోన్మాదానికి వేలాదిమంది అమాయక ప్రజలు, పసిపిల్లలు బలైపోయారు. ఉక్రెయిన్‌ దేశం సర్వనాశనం అయిపోయింది. అయినా అతనిలో ఏ మాత్రం పశ్చాతాపం కనబడకపోగా ఉక్రెయిన్‌కు సాయం అందిస్తున్న దేశాలనే నిందిస్తుండటం, బెదిరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడమంటే యుద్ధాన్ని మరింత ఎక్కువ కాలం పొడిగించడమే అని పుతీన్ కొత్త భాష్యం చెప్పారు. అంటే “మేము ఉక్రెయిన్‌పై బాంబులు కురిపిస్తూనే ఉంటాము... ఎవరూ మమ్మల్ని అడ్డుకోవద్దు... ఎవరూ ఉక్రెయిన్‌కు సాయపడొద్దు. వారి చావు వారిని చావనీయండి,” అని చెపుతున్నట్లే కదా? 

 ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ క్షిపణులు అందించాలని అమెరికా నిర్ణయంపై పుతిన్ తీవ్రంగా స్పందిస్తూ, “ఈ విదంగా చేయడం అంటే ఉక్రెయిన్‌ యుద్ధం దీర్గకాలం కొనసాగించాలని కోరుకొంటున్నట్లే భావిస్తాము. తీరు మార్చుకోకపోతే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పటివరకు  మేము ఉక్రెయిన్‌కే పరిమితమయ్యాము. తీరు మార్చుకోకపోతే ఈ కొత్త లక్ష్యాలపై దాడి చేయడానికి వెనకాడబోము, “ అని పుతిన్ యూరోప్, అమెరికా దేశాలను హెచ్చరించారు. 

 ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించింది రష్యా. కనుక తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధంలో రష్యాను నేరుగా ఎదుర్కుంటే యుద్ధం తమ దేశాలకు కూడా వ్యాపిస్తుందనే భయంతో యూరోప్, అమెరికా దేశాలు ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలు అందిస్తూ సాయపడుతున్నాయి. ఆ కారణంగా మూడు రోజులలో లొంగిపొతుందనుకొన్న ఉక్రెయిన్‌ మూడు నెలలైనా వశం కాలేదు. 

పైగా ఇప్పుడు ఉక్రెయిన్‌ చేతికి లాంగ్ రేంజ్ మిసైల్స్ అందినట్లయితే ఇప్పటివరకు తనను తాను కాపాడుకోవడానికే పరిమితమవుతున్న ఉక్రెయిన్‌ రష్యాలో లక్ష్యాలపై ఎదురుదాడి కూడా చేయగలదు. ఈ అనాలోచిత యుద్ధంతో ఇప్పటికే చాలా నష్టపోతున్న రష్యా అప్పుడు మరింత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుకనే పుతిన్ ఈవిధంగా అమెరికా, యూరప్ దేశాలను బెదిరిస్తున్నట్లు అర్థమవుతోంది. 

కానీ ఇప్పటికైనా రష్యాను కట్టడి చేయకపోతే యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న పుతిన్ ఉక్రెయిన్‌తో ఆగకపోవచ్చు. ఉక్రెయిన్‌ తరువాత దాని పొరుగునే ఉన్న ఫిన్‌లాండ్, రొమేనియా దేశాలను ఆ తరువాత ఇతర దేశాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించవచ్చు. కనుక అమెరికా, యూరప్ దేశాలు పుతిన్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టినట్లు భావించవచ్చు. అప్పుడు రష్యా కూడా ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది కనుక ఇంతవరకు ఏమి జరగకూడదని అమెరికా, యూరప్ దేశాలు భావించాయో రాబోయే రోజులలో అదే జరగవచ్చు. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు.

Related Post