నా బట్టలు అమ్మేసి ప్రజలకు గోధుమలు అందిస్తా: పాక్‌ ప్రధాని

May 30, 2022
img

శ్రీలంక తరువాత దాని బాటలో నడుస్తున్న దేశం పాకిస్థాన్‌. ఆ దేశంలో కూడా నిత్యావసర సరుకుల ధరలు నానాటికీ పెరిగిపోతూ సామాన్యులు కొనలేని స్థాయికి చేరుకొంటున్నాయి. పాకిస్థాన్‌లో నెలకొన్న ఈ పరిస్థితులు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాటల్లోనే కనబడింది. 

మొన్న ధకరా స్టేడియంలో జరిగిన ఓ బహిరంగ సభలో పాక్‌ ప్రధాని మాట్లాడుతూ, “దేశంలో సామాన్య ప్రజలు గోధుమపిండి కూడా కొనుక్కోనలేని పరిస్థితి దాపురించింది. 24 గంటలలోగా గోధుమ పిండి బస్తా ధరలను తగ్గించకపోతే నేను నా దుస్తులను అమ్మైనా సరే ప్రజలకు గోధుమలు అందిస్తాను. దేశంలో ఈ దుస్థితి దాపురించడానికి కారణం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దేశాన్ని అభివృద్ధిపదంలో నడిపించి సమస్యల నుంచి బయటపడేస్తానని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్, పోతూ పోతూ దేశానికి ద్రవ్యోల్భణాన్ని, నిరుద్యోగాన్ని కానుకలుగా ఇచ్చి పోయారు. దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. దేశం కోసం నేను ప్రాణాలు అర్పించడానికైనా సిద్దం. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమస్యలన్నిటినీ ఒకటొకటిగా అంతం చేసి మళ్ళీ గాడిలో పెడతాను,” అని అన్నారు. 

విశేషమేమిటంటే ఇన్ని పెద్ద మాటలు చెపుతున్న పాక్‌ ప్రధాని రూ.1,600 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసులలో ఆయనతో పాటు ఆయన కుమారులు హంజా, సులేమాన్ కూడా నిందితులుగా ఉన్నారు. వారిపై రెండేళ్ల క్రితం ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కేసు నమోదు చేసింది. 

ఆ కేసులో వారి కుటుంబం 28 బినామీ ఖాతాలతో సుమారు 14 బిలియన్ పాకిస్థానీ రూపాయలను దోచుకొందని ఛార్జ్ షీట్‌లో ఎఫ్ఐఏ పేర్కొంది. 

ఈ కేసులలో నిందితుడుగా ఉన్న షహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌ ప్రధాని మంత్రి కాగా, మరో నిందితుడు ఆయన కుమారుడు హంజా షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటువంటి అవినీతిపరులు పాకిస్థాన్‌ను పాలిస్తుంటే ఆ దేశం ఏవిదంగా బాగుపడగలదు?

Related Post