అమెరికాలో మళ్ళీ కాల్పులు.. 18 మంది చిన్నారి విద్యార్దులు మృతి

May 25, 2022
img

అమెరికా తుపాకీ సంస్కృతికి ఆ దేశం మరోమారు భారీ మూల్యం చెల్లించుకొంది. ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పులలో 18 మంది విద్యార్దులతో సహా ఓ ఉపాధ్యాయుడు మరణించారు. చనిపోయిన విద్యార్దులు అందరూ 7 నుంచి 9 ఏళ్ళ వయసులోపు వారే. ఈ వారం నుంచి విద్యార్దుల వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇంతలో ఈ దారుణం జరిగి అభం శుభం తెలియని అమాయకులైన 18 మంది విద్యార్దులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులలో మరికొందరు విద్యార్దులు గాయపడినట్లు తెలుస్తోంది. వారందరినీ కూడా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   

టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియాకు 80కిమీ దూరంలో గల యువల్డీ అనే చిన్న పట్టణంలో రాబ్ ఎలిమెంటరీ స్కూలో ఈ దారుణం జరిగింది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 11.30 గంటలకు 18 ఏళ్ళ యువకుడు తుపాకీతో స్కూల్లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆ యువకుడిని చుట్టుముట్టి కాల్చి చంపారు. అతను యువల్డీ పట్టణానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.

Related Post