రంజాన్ ప్రార్ధనలో బాంబు విస్పోటనం

April 30, 2022
img

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో ఖలీఫా సాబ్ మసీదులో పవిత్ర రంజాన్ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనలు జరుగుతుండగా ఆత్మహుతి దాడి జరిగింది. ఓ వ్యక్తి నడుముకు బాంబుని బిగించుకొని అందరితో పాటు లోపలకి ప్రవేశించి ప్రార్ధనలు జరుగుతుండగా తనను తాను పేల్చేసుకొన్నాడు. 

ఈ బాంబు దాడిలో ఇప్పటివరకు 66 మంది చనిపోగా మరో 78 మంది గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలోనే ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన బాంబు దాడులలో సుమారు 100 మందికి పైగా మృతి చెందారు. 

గతంలో తాలిబన్లే ఈవిదంగా బాంబు దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలను బలిగొనేవారు. గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించగానే తాలిబన్లు మళ్ళీ దేశాన్ని ఆక్రమించుకొని పాలిస్తున్నారు. ఇప్పుడు వారి హయాంలో ఐసిస్ ఉగ్రవాదులు, మరికొన్ని ఇతర ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్‌లో తరచూ దాడులకు పాల్పడుతూ నరమేధం సృష్టిస్తుంటే, తాలిబన్లకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఎందుకంటే నేటికీ వారి ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలు గుర్తించడం లేదు. కనుక అంతర్జాతీయ సహాయసహకారాలు లభించడం లేదు.

Related Post