ఉక్రెయిన్‌ రైల్వేస్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి: 50 మంది మృతి

April 09, 2022
img

ఉక్రెయిన్‌లో రష్యా దళాలు చాలా హేయమైన నేరాలకు పాల్పడుతున్నాయి. బుచా పట్టణంలో పౌరులను కాల్చి రోడ్లపై పడేసి, మహిళలు, బాలికలపై సామూహిక అత్యాచారాలు చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం నుంచి రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయినా రష్యా దారుణాలకు అంతేలేకుండాపోతోంది. 

శుక్రవారం ఉక్రెయిన్‌లోని క్రామటొర్ సిటీ రైల్వేస్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులతో సహా 50 మంది ఉక్రెయిన్‌ పౌరులు చనిపోయారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రష్యా క్షిపణి దాడి తరువాత స్టేషన్ ఆవరణలో పసిపిల్లలను తీసుకువెళ్ళే స్ట్రోలర్స్, ప్రయాణికుల లాగేజ్ చెల్లాచెదురుగా పడిన ఫోటోలు చూస్తే హృదయాలు ద్రవించిపోకమానవు. 

మొదట్లో రష్యా దళాలు ట్యాంకర్లు, యుద్ధవిమానాలతో బాంబు దాడులు మాత్రమే చేస్తూ ప్రజలను హతమారుస్తుండేవి. కానీ 45 రోజులైనా ఉక్రెయిన్‌పై రష్యా పట్టు సాధించలేకపోవడంతో రష్యా దళాలు ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌ ప్రజలు రైళ్ళలో పొరుగుదేశాలకు పారిపోతున్నారు. ఆవిదంగా పారిపోతున్న ప్రజలను కూడా విడిచిపెట్టకుండా రష్యా క్షిపణి దాడులు చేస్తోంది. 

రష్యా సైనికులు తమను అత్యాచారం చేయకుండా తప్పించుకొనేందుకు ఉక్రెయిన్‌ బాలికలు తమ జుట్టు కత్తిరించుకొని మగపిల్లల దుస్తులు ధరించి ఉక్రెయిన్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఆ దేశ ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, రష్యా సైనికులు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

రష్యాను నేరుగా ఎదుర్కొనే శక్తిసామర్ధ్యాలు అమెరికా, యూరప్ దేశాలకు ఉన్నప్పటికీ, అటువంటి ప్రయత్నం చేస్తే అణుబాంబులు ప్రయోగిస్తామని రష్యా బెదిరిస్తుండటంతో వెనక్కు తగ్గి, జరుగుతున్న ఘోరాలను చేతులు ముడుచుకొని చూస్తుండవలసి వస్తోంది. రష్యా ఆగడాలు ఇంకా ఎన్నాళ్ళు సాగుతాయో... ఇంకా ఎంతమంది ధనమానప్రాణాలు కోల్పోవాలో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి. 

Related Post