హైదరాబాద్‌కు మరో మూడు అంతర్జాతీయ కంపెనీలు

March 23, 2022
img

ఇప్పటికే ఫార్మా, ఐ‌టి, వాణిజ్య, ఆటోమోబైల్ తదితర రంగాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌ నగరానికి మరో మూడు అంతర్జాతీయ కంపెనీలు రాబోతున్నాయి. వాటిలో ప్రాసెసర్ల తయారు చేసే క్వాలమ్, ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే ఫిస్కర్, గోల్ఫ్ క్రీడకు సంబందించి డాటాను రూపొందించే కాల్ వే గోల్ఫ్ కంపెనీలున్నాయి. 

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐ‌టి , పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ బృందం శాండియాగోలో క్వాలమ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ సీఎఫ్ఓ  ఆకాష్ పాలీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్ జిన్ తదితరులతో సమావేశమయ్యి దీనిపై చర్చించింది. క్వాలమ్ కంపెనీ హైదరాబాద్‌లో దశలవారీగా రూ. 3,904.55 కోట్లు పెట్టుబడితో 15 లక్షల 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాసెసర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. దీని ద్వారా సుమారు 8,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, వందలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి హైదరాబాద్‌లో తమ తొలి యూనిట్ ప్రారంభిస్తామని క్వాలమ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాబోయే 5 ఏళ్ళలో మిగిలిన యూనిట్స్ ప్రారంభిస్తామని వారు తెలిపారు. 

మంత్రి కేటీఆర్‌ బృందం లాస్‌ఏంజెల్స్‌లోని ఫిస్కర్‌ కార్యాలయంలో ఆ కంపెనీ సీఈవో హెన్రిక్క్ ఫిస్కర్,  సీఎఫ్‌వో గీతా ఫిస్కర్‌ తదితరులతో సమావేశమయ్యి వారికి హైదరాబాద్‌లో ఆటోమోబైల్ రంగం అభివృద్ధి చెందుతున్న తీరు, రాష్ట్ర ప్రభుత్వం ఆ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించారు. దాంతో సంతృప్తి వ్యక్తం చేసిన ఫిస్కర్ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్‌లో తమ పరిశ్రమను స్థాపించేందుకు అంగీకరించారు. త్వరలోనే హైదరాబాద్‌వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు చేసుకొంటామని తెలిపారు. 

లాస్‌ఏంజెల్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న కాల్‌వే గోల్ఫ్‌ కంపెనీ సీఎఫ్‌వో బ్రయాన్‌లించ్, సీఈవో సాయి కూరపాటిలతో మంత్రి కేటీఆర్‌ బృందం మంగళవారం సమావేశమైంది. తాము ఇప్పటికే భారత్‌తో సహా వివిద దేశాలలో తిరిగి చివరికి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకొన్నామని అక్కడే తమ డిజిటెక్ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని ద్వారా సుమారు 300 మంది ఐ‌టి నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. త్వరలోనే సంస్థ ఏర్పాటు, పెట్టుబడి తదితర అంశాలపై ప్రకటన చేస్తామని తెలిపారు. 

Related Post