అమెరికా, నాటో దేశాలకు రష్యా లాస్ట్ వార్నింగ్

March 12, 2022
img

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 17వ రోజుకి చేరుకొన్నాయి. ఈ 17 రోజులలో రష్యా బాంబు దాడులలో ఉక్రెయిన్‌ సర్వనాశనం కాగా లక్షల కోట్ల ఆస్తినష్టం, భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. ఉక్రెయిన్‌ నుంచి రోజూ లక్షలాదిమంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొరుగుయి దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇరుదేశాల మద్య మూడుసార్లు జరిగిన చర్చలు విఫలం అవడంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. 

ఈ నేపధ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో దేశాలకు చెందిన 40 వేల మంది సైనికులు, యుద్ధ విమానాలు, ఆయుధాలతో పోలెండ్ చేరుకొన్నారు. అయితే ఇంతవరకు వారు యుద్ధంలో ప్రవేశించలేదు. ప్రవేశిస్తే అది మూడో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. ఈనెల 14న నాటో దళాలు పోలెండ్‌లో భారీగా సైనిక విన్యాసాలు నిర్వహించడానికి సిద్దం అవుతున్నాయి. దీనిని రష్యా తీవ్రంగా ఖండించడమే కాకుండా అవసరమైతే ఎదురుదాడికి సన్నాహాలు చేసుకొంటోంది. 

అమెరికాతో సహా నాటో దేశాలు తమపై ఆంక్షలు విదించడాన్ని రష్యా తప్పు పట్టింది. తక్షణం ఆంక్షలు ఉపసంహరించకపోతే అంతరిక్షంలో రష్యా సహకారంతో కొనసాగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (స్పేస్ స్టేషన్) కూలిపోతుందని ర‌ష్యా అంత‌రిక్ష ఏజెన్సీ రాస్‌కాస్మోస్ అధిప‌తి హెచ్చరించారు. స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో నిర్ధిష్ట కక్ష్యలో తిరిగేందుకు బూస్టర్ ఇంజన్స్‌కు సంబందించిన కీలకమైన సాంకేతిక సహకారం రష్యా అందజేస్తోంది. ఒకవేళ రష్యా సహాయ నిరాకరణ చేస్తే స్పేస్ స్టేషన్ కూలిపోతుంది. 

రష్యాను యుద్ధంలో నేరుగా ఢీకొంటే అది మూడో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందనే భయంతోనే అమెరికా, నాటో దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూ దానిని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పుడు రష్యా ఆ ఆంక్షలు తక్షణం ఎత్తివేయకపోతే స్పేస్ స్టేషన్ కూల్చి వేస్తామని బెదిరిస్తోంది. కొరకరాని కొయ్యలా తయారైన రష్యాను మరి అమెరికా, నాటో దేశాలు ఏవిదంగా కట్టడి చేస్తాయో చూడాలి. కానీ ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ అక్కడ ఉక్రెయిన్‌ సర్వనాశనం అయిపోతోంది. 

Related Post