నేడు ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు చివరి బ్యాచ్ విద్యార్దులు

March 10, 2022
img

ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న భారతీయ విద్యార్దుల తరలింపు దాదాపు పూర్తయింది. నేడు ఉక్రెయిన్‌ నుంచి 700 మంది విద్యార్దులు ఢిల్లీ చేరుకోనున్నారు. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకొన్నవారు బుదవారమే ఢిల్లీకి చేరుకోవలసి ఉంది. వారందరూ మంగళవారమే తమ హాస్టల్స్ నుంచి బస్సులలో సుమీ నుంచి పోలాండ్ బయలుదేరారు. కానీ దారిలో ఉక్రెయిన్‌, రష్యా దళాలు మద్య భీకర యుద్ధం మొదలడంతో వారు వెనక్కు వెళ్లిపోవలసి వచ్చింది. దీంతో రష్యా, ఉక్రెయిన్‌లపై భారత్‌ ఒత్తిడి పెంచడంతో ఇరుదేశాలు వారి తరలింపుకు సహకరించాయి. కనుక మళ్ళీ నిన్న (బుదవారం) 700 మంది విద్యార్దులు బస్సులలో క్షేమంగా పోలాండ్ చేరుకొన్నారు. నేడు వారందరూ విమానాలలో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. 

ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటిన తరువాత 10 రోజుల్లో ఆపరేషన్ గంగ ద్వారా 16,000 మందికి పైగా విద్యార్దులను కేంద్రప్రభుత్వం క్షేమంగా భారత్‌కు తీసుకువచ్చింది. ఉక్రెయిన్‌లో సుమారు 18,000 మంది వరకు భారతీయులు ఉన్నట్లు సమాచారం. మిగిలిన 2,000 మందిలో చాలా మంది ఇప్పటికే ఉక్రెయిన్‌ వీడి పొరుగు దేశాలకు చేరుకొన్నారు. కనుక వారందరూకూడా త్వరలోనే క్షేమంగా భారత్‌ చేరుకోబోతున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో భారతీయుల తరలింపు కోసం కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం విజయవంతంగా ముగుస్తుంది.

Related Post