రష్యాతో పోరాడుతున్న భారతీయ విద్యార్ధి

March 08, 2022
img

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో అక్కడ వైద్యవిద్య అభ్యసించడానికి వెళ్ళిన భారతీయ విద్యార్దులు, భారత్‌లో వారి తల్లితండ్రులు వారిని కాపాడాలంటూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకొన్నారు. కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించి ‘ఆపరేషన్ గంగా’ పేరుతో బోయింగ్, యుద్ధ రవాణా విమానాలలో వారందరినీ స్వదేశానికి తీసుకువచ్చేసింది. రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో లక్షలాది మంది ఉక్రెయిన్‌ ప్రజలు సైతం భయంతో పొరుగు దేశాలకు తరలివెళ్ళిపోయారు. కానీ కోయంబత్తూరు నుంచి ఉక్రెయిన్‌లో ఖార్కివ్ నగరంలో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్ళిన సాయి నికేష్ రవిచంద్రన్ అనే విద్యార్ధి మాత్రం, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపు మేరకు ప్రభుత్వం అందించిన తుపాకీ చేతపట్టి పారామిలటరీ దళంలో చేరి రష్యా సైనికులతో పోరాడుతున్నాడు. ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌ తరపున పోరాడాలని నిర్ణయించుకొన్నానని కనుక యుద్ధం ముగిసి శాంతి నెలకొనేవరకు తాను తిరిగి వచ్చే ప్రసక్తేలేదని తల్లితండ్రులకు చెప్పాడు. వారు ఎంత నచ్చజెప్పినా సాయి నికేష్ మాత్రం తాను ఉక్రెయిన్‌లో ఉండి పోరాడుతానని చెప్పాడు. 

ఉక్రెయిన్‌ ప్రజలే దేశం విడిచి పారిపోతునప్పుడు తల్లితండ్రులను కాదని ఆ దేశం తరపున తుపాకీ చేతబట్టి రష్యా సాయియికులతో పోరాడాలనే సాయి నికేష్ నిర్ణయం కొందరికి తెలివితక్కువగా, మూర్ఖత్వంగా కనిపించవచ్చు. అయితే కష్టకాలంలో ఆ దేశానికి ఉడతాభక్తిగా పోరాడాలనుకోవడం కొందరికి చాలా సాహసోపేతమైన గొప్ప నిర్ణయంగా కనిపించవచ్చు.

Related Post