ఉక్రెయిన్‌కు నాటో దళాలు, యుద్ధ విమానాలు

March 07, 2022
img

ఉక్రెయిన్‌పై రష్యా వరుసగా 12రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తూ సర్వనాశనం చేస్తుండటంతో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి మేరకు నాటో దేశాలకు చెందిన 40 వేలమంది సైనికులు, ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు, మరో నాలుగు ఫైర్ జట్లు ఆదివారం ఉక్రెయిన్‌ సరిహద్దు దేశమైన పోలాండ్‌కు చేరుకొన్నాయి. అవి ఏ క్షణంలోనైనా రష్యా సేనలపై దాడులు ప్రారంభించవచ్చు. 

ఈ యుద్ధంలో నాటో దేశాలు కలుగజేసుకొంటే వాటిని కూడా శత్రువులుగా పరిగణించి ఆయా దేశాలతో కూడా యుద్ధం చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతీన్ హెచ్చరించారు. కనుక నాటో సైనికులు, యుద్ధవిమానాల ప్రవేశంతో యుద్ధం ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది.  

ఓ పక్క ఉక్రెయిన్‌పై రేయింబవళ్ళు రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే, ఉక్రెయిన్‌తో నేడు మరోసారి శాంతి చర్చలలో పాల్గొనబోతోంది. అయితే ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాలు వదిలి లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని రష్యా ముందే చెప్పినందున మూడవ దఫా చర్చలు కూడా విఫలమవుతాయని స్పష్టం అయ్యింది. మరోపక్క అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై నేడు, రేపు విచారణ జరుగనుంది. 

ఒకవేళ రష్యా దళాలు తనను హతమారిస్తే ఉక్రెయిన్‌ దేశాన్ని, ప్రజలను కాపాడవలసిందిగా జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో జో బైడెన్‌ సూచన మేరకు ఆయనను సురక్షితంగా బయటకు తరలించేందుకు బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్, అమెరికాకు చెందిన స్వాట్‌ బృందాలు కూడా పోలాండ్‌కు చేరుకొన్నట్లు తాజా సమాచారం. 

Related Post