పాలస్తీనలో భారత్ దౌత్యవేత్త ముకుల్ ఆర్య అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయారు. రమల్లాలోని భారత్ ఎంబసీ కార్యాలయంలో ఆదివారం ఆయన విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ “ముకుల్ ఆర్య చనిపోయిన వార్త విని నేను చాలా షాక్ అయ్యాను. ఆయన ఆయన చాలా తెలివైన, ప్రతిభావంతుడైన అధికారి. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి,” అని ట్వీట్ చేశారు.
ముకుల్ ఆర్య మృతి పట్ల పాలస్తీన అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ షాయే, విదేశాంగ మంత్రి రియాల్ అల్ మాలికి తీవ్ర దిగ్బ్రంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిపై తక్షణమే దర్యాప్తు జరపాలని సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముకుల్ ఆర్య భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత్‌కు సహకరిస్తామని రియాల్ అల్ మాలికి తెలిపారు.
ఇండియన్ ఫారిన్ సర్వీసస్-2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్ ఆర్య కాబూల్, మాస్కో రాయబార కార్యాలయాలలో పని చేశారు. ఢిల్లీలోని విదేశాంగశాఖ కార్యాలయంలో పనిచేశారు. ఆ తరువాత పారిస్‌లోని యునెస్కోలో భారత్ శాస్విత ప్రతినిధి బృందంలో కూడా కొంతకాలం పనిచేశారు.