ఉక్రెయిన్‌ అభ్యర్ధనను తిరస్కరించిన నాటో

March 05, 2022
img

గత నెల 24వ తేదీ తెల్లవారుజాము నుంచి నేటి వరకు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపిస్తూ ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అనేకమంది ప్రజల ప్రాణాలు పొట్టనపెట్టుకొంటున్నాయి. కనుక ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో-ఫ్లై-జోన్‌గా ప్రకటించాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటో దేశాలను అభ్యర్ధించారు. అయితే అది చాలా ప్రమాదకరమైనదని, దాంతో ఇప్పుడు ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితమైన యుద్ధం యావత్ నాటో దేశాలకు విస్తరిస్తుంది కనుక ఉక్రెయిన్‌ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ తెలిపారు. 

ఒకవేళ ఉక్రెయిన్‌ కోరినట్లుగా ఆ దేశ గగనతలాన్ని నో-ఫ్లై-జోన్‌గా ప్రకటించినట్లయితే, రష్యా యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించకుండా నాటో యుద్ధ విమానాలను మోహరించి అడ్డుకోవలసి ఉంటుంది. అప్పుడు రష్యా నాటో దేశాలతో కూడా యుద్ధం ప్రారంభిస్తుంది. అందుకే ఉక్రెయిన్‌ అభ్యర్ధనను తిరస్కరించవలసి వచ్చింది. అయితే నాటో దేశాలు ఉక్రెయిన్‌ భూ భాగంలోకి, గగనతలంలోకి ప్రవేశించవని నాటో సెక్రటరీ జనరల్ హామీ ఇచ్చారు. 

నాటో నిర్ణయంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. “మా దేశంపై రష్యా బాంబులు కురిపించేందుకు దీంతో నాటో అనుమతి మంజూరు చేసినట్లయింది. ఉక్రెయిన్‌ సర్వనాశనం చేయడానికి రష్యాకు నాటో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక్కడ మా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ఒంటరిగా రష్యాతో పోరాడుతూనే ఉన్నాము. మా ఈ కష్టకాలంలో నాటో దేశాలు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం,” అని ఆవేదన వ్యక్తం చేశారు. 


Related Post