అణువిద్యుత్ ప్లాంట్‌పై రష్యా బాంబుల వర్షం

March 04, 2022
img

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి నేటికీ 9 రోజులైంది. అమెరికాతో సహా ప్రపంచదేశాలు, ఐక్యరాజ్య సమితి ఏవీ రష్యాను కట్టడిచేయలేకపోవడంతో, రష్యా నానాటికీ పెట్రేగిపోతోంది. శుక్రవారం తెల్లవారుజామున రష్యా దళాలు జాపోరిషియాలోని అణువిద్యుత్ ప్లాంట్‌పై బాంబుల వర్షం కురిపించారు. అదృష్టవశాత్తు అణు రియాక్టర్ దెబ్బ తినలేదు. లేకుంటే అణుధార్మికత కలిగిన వాయువులు వెలువడి అపారమైన ప్రాణనష్టం జరిగి ఉండేది. ప్లాంటులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాంట్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. 

యూరోప్ దేశాలలోకెల్లా అతి పెద్దదైన ఈ ప్లాంట్ ఒకవేళ పేలిపోతే చాలా భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. అణుయుద్ధానికి తహతహలాడుతున్న రష్యా నేరుగా శతృదేశాలుగా భావిస్తున్న అమెరికా, యూరప్ దేశాలపై వాటిని ప్రయోగించే సాహసం చేయలేక ఇటువంటి దుస్సాహాసం చేస్తూ యుద్ధానికి కవ్విస్తోందని యుద్ధ నిపుణులు భావిస్తున్నారు. 

జాపోరిషియాలోని అణువిద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడిని ఉక్రెయిన్‌, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, అమెరికా తదితర అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ అణు విద్యుత్ సంస్థ (ఐఏఈఏ) ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని పేర్కొంది. ఒకవేళ దీనిలో రియాక్టర్ ప్రేలిపోయినట్లయితే చెర్నోబిల్ విధ్వంసం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కనుక తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరమని నొక్కి చెప్పింది.

Related Post