భారతీయ విద్యార్దుల తరలింపుకి రష్యా సాయం

March 04, 2022
img

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకొన్న భారతీయ విద్యార్దులను కేంద్రప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో యుద్ధ రవాణా విమానాలు, పౌరవిమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా కూడా భారతీయ విద్యార్దులను స్వదేశానికి తరలించేందుకు తోడ్పడుతుండటం విశేషం. 

ఖార్కివ్, సుమే ప్రాంతాలలో చిక్కుకొన్న భారతీయ విద్యార్దులను రష్యాలో బెల్గోరాడ్‌కు తరలించేందుకు రష్యాయే 130 బస్సులను ఏర్పాటు చేయడం విశేషం. ఉక్రెయిన్‌ సైనికులు రష్యా నుంచి దాడులు తప్పించుకొనేందుకు తమకు రక్షణ కవచంగా 3,179 మంది భారతీయ విద్యార్దులను బందీలుగా ఉంచుకొన్నారని రష్యా అధ్యక్షుడు పుతీన్ ఆరోపించారు. తమ అధ్యక్షుడు పుతీన్ ఆదేశాల మేరకు ఖార్కీవ్ రైల్వేస్టేషన్‌లో బందీలుగా ఉన్న వారందరినీ విడిపించి తమ బస్సులలో భద్రంగా రష్యాకు చేర్చుతామని రష్యన్ కల్నల్ జనరల్ మిఖెయిల్ మిజిన్‌సేవ్ చెప్పారు.     

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ విషయంలో భారత్‌ అనుసరించిన తటస్థ వైఖరి సత్ఫలితాలు ఇచ్చిందని దీంతో స్పష్టం అయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ఓటింగ్ నిర్వహించగా భారత్‌ దానికి దూరంగా ఉండిపోయింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో రెండుసార్లు ఫోన్లో మాట్లాడి ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినా పుతీన్ తమ మిలటరీ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్‌లో మొత్తం 20,000 మంది భారతీయులు ఉన్నారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 6,000 మంది క్షేమంగా భారత్‌ చేరుకోగా మరో 11,000 మంది ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలైన రొమేనియా, పోలాండ్, హంగేరీ, స్లోవేకియా దేశాలకు చేరుకొన్నారు. మరో 3,000 మంది రష్యా సైనికుల సాయంతోనే ఉక్రెయిన్‌ నుంచి బయటపడే అవకాశం ఉంది. 

Related Post