రష్యా దాడిలో భారత్‌ విద్యార్ధి నవీన్ గౌడ మృతి

March 02, 2022
img

ఉక్రెయిన్‌పై రష్యా దాడులలో మంగళవారం ఒక భారతీయ వైద్య విద్యార్ధి మృతి చెందాడు. కర్ణాటకలోని హవేరి జిల్లా చాలగెరికి చెందిన నవీన్ జ్ఞానగౌడ్ (21) ఖార్కివ్‌లోని నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నగరంపై రష్యా దాడులు మొదలవడంతో నాలుగు రోజులుగా ఖార్కివ్‌ గవర్నర్‌ బంగ్లాకు సమీపంలో ఉన్న ఓ బంకర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. నిన్న మధ్యాహ్నం సమీపంలో ఉన్న ఓ సూపర్ మార్కెట్‌ నుంచి నీళ్ళు, ఆహారం తెచ్చుకొనేందుకు వెళ్ళి అక్కడ క్యూలైన్లో నిలబడి ఉండగా సరిగ్గా అదే సమయంలో రష్యా దళాలు ఖార్కివ్‌ గవర్నర్‌ బంగ్లాపై బాంబుల వర్షం కురిపించాయి. ఆ ప్రేలుడు ధాటికి నవీన్ జ్ఞానగౌడ్‌తో పాటు అక్కడ క్యూలైన్లో నిలబడి ఉన్న పలువురు మృతి చెందారు. భారత్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేసి నవీన్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. 

యుద్ధం మొదలైనప్పటి నుంచి నవీన్‌తో ప్రతీరోజూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నామని తల్లితండ్రులు చెప్పారు. నిన్న కూడా గంట ముందు మాట్లాడామని, త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చేస్తానని నవీన్ తమకు ధైర్యం చెప్పాడని కానీ ఇంతలోనే కొడుకు చనిపోయాడనే వార్త వినాల్సివచ్చిందని నవీన్ తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

రష్యా దాడిలో భారతీయ విద్యార్ధి మృతి చెందడంతో మిగిలిన విద్యార్దుల తల్లితండ్రులలో ఆందోళన పెరిగిపోయింది. ఎలాగైనా తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఉక్రెయిన్‌లో పరిస్థితులు దిగజారుతుండటంతో కేంద్రప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానాలతో పాటు సీ-17 యుద్ధ రవాణా విమానాలను కూడా భారతీయుల తరలింపుకు ఉపయోగిస్తోంది. సాధారణ పౌర విమానాలు ఒక్కోటి 180 మందిని తీసుకురాగలవు కానీ ఈ యుద్ధ రవాణా విమానం ఒకేసారి 300 మందిని సులువుగా తీసుకురాగలవు. బుదవారం తెల్లవారుజామున ఓ సీ-17 విమానం ఉక్రెయిన్‌కు బయలుదేరింది. నిన్న ఒక్కరోజే ఉక్రెయిన్‌ నుంచి 1,377 మంది విద్యార్దులు స్వదేశానికి చేరుకొన్నారు. ఈ మూడు రోజులలో 26 విమానాలతో వీలైనంత ఎక్కువ మందిని భారత్‌కు తీసుకువస్తామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పారు. 

Related Post