ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్రప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో విమానాలలో స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 709 విద్యార్దులను క్షేమంగా భారత్ చేరుకొన్నారు. ముంబై, ఢిల్లీలకు చేరుకొన్న తెలుగు విద్యార్దులు విమానాలలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్నారు. వారిలో తెలంగాణకు చెందిన విద్యార్దులు 37 మంది ఉన్నారు. ఉక్రెయిన్‌లో విద్యార్దులతో కలిపి సుమారు 18,000 మంది భారతీయులుండగా వారిలో ముందుగా ఉక్రెయిన్ సరిహద్దులలో నివశిస్తున్నవారిని పొరుగునే ఉన్న రొమేనియా, హంగేరీ, పోలాండ్, స్లోవేకియా దేశాల సహకారంతో కేంద్రప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానాలలో భారత్‌కు తరలిస్తోంది. ఇప్పటివరకు సుమారు 4,000 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి ఈ పొరుగుదేశాలకు చేరుకొన్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వి శ్రింగ్ల తెలిపారు. వారందరినీ క్షేమంగా భారత్ చేర్చుతామని చెప్పారు. ఈ సందర్భంగా ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి బయలుదేరబోతున్న ఎయిర్ ఇండియా విమానాల షెడ్యూల్ ఆయన మీడియాకు విడుదల చేశారు.