ఉక్రెయిన్‌ సరిహద్దులో అమెరికా విమానాలు?

February 26, 2022
img

ఉక్రెయిన్‌ సరిహద్దులో అమెరికా విమానాలను గుర్తించామని రష్యా ప్రకటించింది. అయితే అవి యుద్ధ విమానాలు కావని, బహుశః ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీని, కుటుంబ సభ్యులను అమెరికా తరలించేందుకు వచ్చి ఉండవచ్చని రష్యా పేర్కొంది. 

మరోపక్క ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా సేనలు పూర్తిగా తమ అధీనంలో తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తుండటంతో జెలెన్ స్కీని తక్షణం అక్కడి నుంచి బయటకువచ్చేయాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. రష్యా లక్ష్యం తనను, తన కుటుంబాన్ని హతమార్చడమేనని అయినా తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కీవ్ విడిచిపెట్టి వెళ్ళనని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. చెప్పడమే కాదు...కీవ్ వీధుల్లో తిరుగుతూ రష్యా దాడులతో భయంతో వణికిపోతున్న ప్రజలకు ధైర్యం చెపుతున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తాను దేశం విడిచి పారిపోయాననే పుకార్లకు వాటితో జవాబు చెప్పారు. 

ఎట్టి పరిస్థితులలో కీవ్ నగరాన్ని రష్యా వశం కాకుండా కాపాడుకొంటామని జెలెన్ స్కీ అన్నారు. ఇప్పుడు కొన్ని పశ్చిమ దేశాలు తమకు ఆయుధాలు అందించి సాయపడుతున్నాయని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

ఉక్రెయిన్‌ సరిహద్దు దేశమైన రొమేనియా నుంచి 219 మంది భారతీయ విద్యార్దులను తీసుకొని ఎయిర్ ఇండియా విమానం ఈరోజు ఉదయం ముంబైకి బయలుదేరిందని భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఉక్రెయిన్‌లో భారతీయుల తరలింపు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. భారతీయుల తరలింపుకి తోడ్పడుతునందుకు  రొమేనియా విదేశాంగ మంత్రి బోగ్దాన్ అరెస్కూకి జైశంకర్ ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Related Post