వెనక్కు తిరిగివచ్చిన ఎయిర్ ఇండియా విమానం

February 24, 2022
img

ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆ దేశంలో చిక్కుకొన్న భారతీయులను వెనక్కు రప్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక విమానాలను పంపించేందుకు సిద్దమైంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గురువారం ఉదయం 182 మంది ఢిల్లీకి క్షేమంగా చేరుకొన్నారు. ఈరోజు ఉదయం 7.30 గంటలకు డిల్లీ నుంచి మరో ఎయిర్ ఇండియా విమానం కీవ్ నగరానికి బయలుదేరింది. కానీ అప్పటికే కీవ్ నగరంపై రష్యా బాంబులు, క్షిపణులతో దాడులు చేస్తుండటంతో ఆ దేశం తమ గగనతలాన్ని మూసివేసింది. కనుక ఎయిర్ మిషన్ సూచన మేరకు ఎయిర్ ఇండియా విమానం పావు గంటసేపు ప్రయాణించిన తరువాత వెనక్కు తిరిగివచ్చేసింది. 

ఉక్రెయిన్‌లో సుమారు 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వారిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్ళిన విద్యార్దులే చాలా మంది ఉన్నారు. వారందరూ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోవడంతో వారి తల్లితండ్రులు, బంధుమిత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 


ప్రస్తుతం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరాన్ని వశపరుచుకోవడానికి రష్యా భీకర దాడులు చేస్తునందున ఉక్రెయిన్‌లో ఇతర ప్రాంతాలలో ఉన్నవారికి ఇబ్బందీ లేదని తెలుస్తోంది. కానీ ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నీళ్ళు, ఆహారం, అత్యవసరమైన మందులు నిలువ ఉంచుకోవాలని సూచిస్తున్నారు.       

కీవ్ నగరంపై భీకర దాడులతో తల్లడిల్లిపోతున్న ప్రజలు మూటాముల్లె సర్దుకొని వాహనాలలో నగరం ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోతున్నారు. దీంతో కీవ్ నగరంలో ఎక్కడికక్కడ వాహనాలతో ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. నిత్యం కళకళలాడుతుండే కీవ్ నగరం ప్రస్తుతం బాంబు దాడులతో భయానకంగా మారింది.

Related Post