ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా... భీకర దాడులు

February 24, 2022
img

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించేసారు. అయితే యుద్ధం అనే పదానికి బదులు మిలటరీ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. పుతీన్ యుద్ధ ప్రకటన చేయడంతో రష్యా సేనలు ఈరోజు తెల్లవారుజాము నుంచే ఉక్రెయిన్‌ను మూడు వైపుల నుంచి ట్యాంకులు, యుద్ధవిమానాలతో చుట్టుముట్టి, బాంబులు, క్షిపణుల వర్షం కురూపిస్తూ చురుకుగా ముందుకు సాగుతున్నాయి. రష్యా సేనలు ముందు నుంచే యుద్ధ సన్నాహాలు చేసుకొని సిద్దంగా ఉండటంతో కేవలం మూడు గంటలలోనే ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌లోకి జొరబడి విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నాయి. ఉక్రెయిన్‌లో కైవ్‌, మారియ్పోల్ నగరాలపై రష్యా దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌ ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఉక్రెయిన్‌లోని మరో ఆరు ప్రధాన ప్రాంతాలను రష్యా దళాలు చుట్టూ ముట్టి ఉక్రెయిన్‌ సైనికులతో పోరాడుతున్నాయి. యుద్ధం ప్రారంభించగానే రష్యా వాయుసేన ఉక్రెయిన్‌లోని ఆరు ప్రధాన ఎయిర్ బేస్‌లపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. 

ఉక్రెయిన్‌ వలన తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున యుద్ధం ప్రకటించవలసి వచ్చిందని, కనుక ఈ యుద్ధంలో ఇతర దేశాల జోక్యం సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందే హెచ్చరించారు. కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రష్యాను చాలా తీవ్రంగా హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దాడులకు తగిన రీతిలో జవాబు చెపుతామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి రష్యాయే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. మరో పక్క ఐక్యరాజ్య సమితి కూడా అత్యవసరంగా సమావేశమై ఉక్రెయిన్‌పై దాడులు తక్షణం నిలిపివేయాలని రష్యాకు విజ్ఞప్తి చేసింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, అమెరికా మిత్ర దేశాల హెచ్చరికల నేపధ్యంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అమెరికాతో సహా యూరోప్ దేశాలు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. తమ హెచ్చరికలను భేఖాతరు చేస్తూ రష్యా యుద్ధం ప్రారంభించడంతో అమెరికా, మిత్రదేశాలు నేడు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ అవి ఉక్రెయిన్‌కి మద్దతుగా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే పరిస్థితులు మరింత విషమించవచ్చు.

Related Post