అమెరికాలో పెరుగుతున్న కరోనా... భారత్‌లో తగ్గుతున్న కేసులు

February 05, 2022
img

భారత్‌, అమెరికాలను ఏవిదంగానూ సరిపోల్చుకోలేము. భారత్‌ జనాభా అమెరికాకు 10-12 రెట్లు ఎక్కువ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక వైద్య సౌకర్యాలు అమెరికా సొంతం. నేటికీ భారత్‌లో వేలాది గ్రామాలకు కనీసం రోడ్లు కూడా లేవు. అత్యవసరమైతే రోగులను మంచంపై మోసుకొంటూ వాగులు, మట్టిరోడ్లు మీదుగా జిల్లా కేంద్రాలకు తీసుకురావలసిందే. 

అమెరికాతో పోలిస్తే భారత్‌లో నిరక్షరాస్యత, పేదరికం, మూఢనమ్మకాలు కూడా ఎక్కువే. ఆ కారణంగా నేటికీ ఒక్క డోసు కరోనా టీకా కూడా వేసుకోనివారు కోట్లమంది ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితులలో కూడా భారత్‌లో కరోనా మహమ్మారి అదుపుతప్పలేదు. గత నెలలో రోజుకి మూడు లక్షల కరోనా కేసులు నమోదు కాగా ఇప్పుడు 1.25 లక్షలకు తగ్గిపోయాయి. కరోనా మరణాల సంఖ్య కూడా రోజుకి 2-3,000 లోపే ఉంటోంది. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ, మహారాష్ట్రలో సైతం మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు తెరుస్తున్నారు. మరో రెండు మూడు వారాలలలో భారత్‌లో కరోనా పూర్తిగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

అయితే అగ్రరాజ్యమైన అమెరికాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయిప్పుడు. రోజుకి లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేవలం గత 2 నెలల వ్యవధిలోనే అమెరికాలో సుమారు లక్ష మంది కరోనాతో మరణించారని జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటికైనా ప్రజలందరూ ఖచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని లేకుంటే కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉంటాయని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

భారత్‌లో సుమారు 135 కోట్ల జనాభాలో కనీసం 60-70 శాతం మంది కనీసం ఒక్క డోస్‌ టీకా అయినా వేసుకోగా అమెరికా 33.2 కోట్ల జనాభాలో ఇప్పటివరకు కేవలం 64 శాతం మంది మాత్రమే కరోనా టీకాలు వేసుకొన్నారు. భారతీయులకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, భారత్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది కొండలు, నదులు దాటుకొని మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి టీకాలు వేస్తుండటం, అధికశాతం ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తుండటం వంటివి భారత్‌ను కరోనా నుంచి బయటపడేస్తున్నాయని భావించవచ్చు.

అమెరికా సంస్కృతి, ప్రజల ఆహార, విహార అలవాట్లు, వాతావరణం ఆ దేశంలో కరోనా పెరుగుదలకి కారణం అయ్యుండవచ్చు. అయితే ఈసారి కూడా అమెరికా కూడా కరోనాపై యుద్ధంలో తప్పక గెలుస్తుంది.  

Related Post