మంచులో చిక్కుకొని భారతీయ కుటుంబం మృతి

January 22, 2022
img

అమెరికా-కెనడా దేశాల సరిహద్దుల మద్య బుదవారం రాత్రి తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నంలో ఓ భారతీయ కుటుంబం మంచులో చిక్కుకొని చలికి గడ్డ కట్టి చనిపోయింది. చనిపోయినవారిలో భార్యాభర్తలు, ఒక టీనేజర్, ఒక చిన్నారి ఉన్నారు. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్ వద్ద బుదవారం రాత్రి వారు బోర్డర్ దాటి 40 అడుగుల దూరం ప్రయాణించేసరికే వారి వాహనం మంచులో చిక్కుకుపోవడంతో నలుగురూ చలికి రక్తం గడ్డకట్టి వాహనంలోనే చనిపోయారు.    

తాజా సమాచారం ప్రకారం ఆ సమయంలో బయట మైనస్ 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. భయంకరమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. అక్రమంగా సరిహద్దులు దాటించే ఓ ముఠాను నమ్ముకొని వారు కటికచీకటిలో...భయంకరంగా మంచుకురుస్తున్న సమయంలో కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు బయలుదేరి దారిలోనే ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వారిని అమెరికాలోకి అక్రమంగా తీసుకువస్తున్న స్టీవ్ శాండ్ (47) అనే వ్యక్తి అమెరికాలోకి ప్రవేశిస్తుండగా నార్త్ డకోటా వద్ద భద్రతా దళాలు అతనిని అరెస్ట్ చేసాయి. అతని వ్యానులో భారీగా ఆహారం ప్యాకెట్లు వగైరా కనిపించడంతో అతని వెనుక ఇంకా చాలా మందే బయలుదేరి ఉండవచ్చని అనుమానం వచ్చి వెంటనే వారు కెనడా బోర్డర్ సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు మంచులో గాలింపు మొదలుపెట్టగా మొత్తం 15 మంది భారతీయులను కనుగొన్నారు. కెనడా సరిహద్దుకు కేవలం 40 అడుగుల దూరంలో మంచులో కూరుకుపోయిన ఓ కారులో చలికి గడ్డకట్టి చనిపోయిన మరో భారతీయ కుటుంబాన్ని కనుగొన్నారు. 

ఈ ఘటనపై భారత్‌ విదేశాంగమంత్రి యస్.జయశంకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, కెనడాలోని భారత్‌ రాయబారులు దీనిపై తక్షణమే స్పందించి వారి మృతదేహాలను భారత్‌ చేర్చేందుకు తోడ్పడాలని ఆదేశించారు.

Related Post