అమెరికా ఎన్‌ఆర్ఐకి రూ.11.80 కోట్లు కుచ్చుటోపీ

December 17, 2021
img

అవును...రూ.11.80 కోట్లే! అదీ అమెరికాలో వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న వ్యక్తికి హైదరాబాద్‌ నుంచి ముగ్గురు కుచ్చుటోపీ పెట్టారు. 

డాక్టర్ చంద్రశేఖర్ అమెరికాలో వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌ నుంచి గీతానారాయణన్, లక్ష్మీ, బెంజిమేన్ అనే ముగ్గురు వ్యక్తులు ఆయనతో ఓ బిజినెస్ వ్యవహారం గురించి మాట్లాడారు. జంతువులకు కరోనా సోకకుండా వేసే టీకాల తయారీలో ఉపయోగించే ఓ రకమైన నూనె పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని వారు ఆయనకు నచ్చజెప్పారు. వారి మాయ మాటలు నమ్మి ఆయన క్రమంగా రూ.11.80 కోట్లు వారు చెప్పిన ఖాతాలలోకి బదిలీ చేశారు.

అయితే చివరికి వారు ముగ్గురూ తనను మోసం చేశారని గ్రహించిన డాక్టర్ చంద్రశేఖర్, నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి వారి కోసం గాలించారు. కానీ వారి ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా వారు ముగ్గురూ నైజీరియన్లని, మారు పేర్లతో డాక్టర్ చంద్రశేఖర్‌ను మోసగించారని గుర్తించారు. 

డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాద్‌ నుంచి మళ్ళీ అమెరికా తిరిగి వెళ్ళిన తరువాత అక్కడ సెయింట్ లూసియానాలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు వెంటనే ఎఫ్‌బీఐని అప్రమత్తం చేయడంతో ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించి ఆ సొమ్ము బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి దుబాయ్, అమెరికాలోని బ్యాంక్ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించి వెంటనే దానిని ఫ్రీజ్ చేశారు. ఆ తరువాత ఆ ముగ్గురు నైజీరియన్ల ఆచూకీ కనిపెట్టేందుకు ఇక్కడ హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు, అక్కడ అమెరికాలో ఎఫ్‌బీఐ అధికారులు గాలిస్తున్నారు. 

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఇలా మాయగాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది వారి అమాయకత్వమో లేదా మాయగాళ్ళ తెలివితేటలనుకోవాలా?

Related Post