బీజింగ్ ఒలింపిక్స్‌ను బహిష్కరించిన కెనడా

December 09, 2021
img

ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం దక్కడం ఏ దేశానికైనా గర్వకారణమే...లాభదాయకమే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు చైనా రాజధాని బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్‌ జరుగబోతున్నాయి. అయితే కరోనాను ప్రపంచానికి అంటించిన లక్షలాది మంది మరణాలకు కారణమై, ప్రపంచదేశాల ఆర్ధిక, సామాజిక, పారిశ్రామిక వ్యవస్థలను దారుణంగా దెబ్బ తీసిన కారణంగా చైనా ప్రతిష్ట చాలా దెబ్బ తింది. అయినప్పటికీ చైనా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా భారత్‌, భూటాన్, తైవాన్ వంటి ఇరుగుపొరుగు దేశాలను, చివరికి సముద్రాలలో దీవులను కూడా ఆక్రమించుకొనే ప్రయత్నాలు చేస్తోంది. వాణిజ్యపరంగా కూడా ప్రపంచదేశాలపై గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. చైనాలో మానవహక్కుల ఉల్లంఘన ఎప్పటి నుంచో సాగుతోంది. 

ఈ అన్ని కారణాల చేత అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, దేశాలు వచ్చే ఏడాది బీజింగ్‌లో జరుగబోయే ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు కెనడా కూడా ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. ఈ విషయం ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్వయంగా ప్రకటించారు. తమ దేశ రాయబారులు, అధికారులు ఎవరూ బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనరని ప్రకటించారు. కానీ తమ క్రీడాకారులు మాత్రం ఒలింపిక్స్‌లో పాల్గొంటారని తెలిపారు. ఈ అంశంపై తమ మిత్రదేశాలతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకొన్నామని జస్టిన్ ట్రూడో తెలిపారు. 

ఫ్రాన్స్ కూడా మిత్రదేశాలతో పాటు బీజింగ్‌ ఒలింపిక్స్‌ను బహిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. దేనినైనా కనీవినీ ఎరుగని రీతిలో అత్యద్భుతంగా చేసి చూపే చైనాకు ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బే. కానీ ఇటువంటి సమస్యలను పట్టించుకొనే రకం కాదు చైనా! కనుక ఎన్ని దేశాలు బహిష్కరించినా చాలా అట్టహాసంగా ఒలింపిక్స్‌ నిర్వహించడం తధ్యం. 

        


Related Post