ఐఎంఎఫ్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా గీతా గోపీనాథ్

December 04, 2021
img

ప్రపంచ దేశాలు భారత్‌ మేధాశక్తిని ఎప్పుడో గుర్తించినా గత దశాబ్ధకాలంలో ప్రవాస భారతీయులకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. అటు అమెరికా ప్రభుత్వంలో, ఇటు అంతర్జాతీయ సంస్థలలో భారత్‌ సంతతికి చెందినవారు కీలక పదవులు చేపడుతున్నారు. ఇటీవల ట్విట్టర్‌ సీఈఓగా భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్‌ నియమితులు కాగా తాజాగా గీతా గోపీనాథ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్)(ఐఎంఎఫ్)కు డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఆమె ఐఎంఎఫ్ లో ప్రధాన ఆర్ధికవేత్తగా పనిచేశారు. ఇటీవల ఆమె పదవీకాలం ముగియడంతో ఆమె హార్వర్డ్ యూనివర్సిటీకి తిరిగి వెళ్లిపోయేందుకు సిద్దం అవుతుండగా ఆమెను ఈ అత్యున్నత పదవి వరించింది.

కరోనా సమయంలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు, దానిని అధిగమించేందుకు ఆమె చక్కటి మార్గదర్శనం చేశారు. అత్యంత సంక్లిష్టమైన ఈ కార్యాన్ని గీత గోపీనాథ్ అత్యంత సమర్ధంగా నిర్వహించారని, కనుక అనుపమానమైన ఆమె సేవలు ఐఎంఎఫ్ కు చాలా అవసరమని భావించి ఆమెకు ఈ కొత్త బాధ్యతలు అప్పగించామని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియెవా తెలిపారు.       

గీతా గోపీనాథ్ 1971లో కోల్‌కతాలో జన్మించి అక్కడే 12వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. తరువాత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్‌లో బీఏ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేశారు. తరువాత వాషింగ్‌టన్‌లో మరోసారి ఎంఏ ఎకనామిక్స్ చేసి, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. తరువాత షికాగో యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్‌గా చేశారు. 2018లో ఐఎంఎఫ్ చేరారు. ఇప్పుడు అదే సంస్థలో రెండో స్థానంలో కీలక బాధ్యతలు చేపట్టారు.

Related Post