అమెరికాలో పాఠశాలలో విద్యార్దులపై కాల్పులు!

December 01, 2021
img

అమెరికాలో మళ్ళీ తుపాకి మోతలు మారుమ్రోగాయి. మిచిగాన్ రాష్ట్రంలో ఆక్స్‌ఫర్డ్ అనే పట్టణంలో గల ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్లో చదువుతున్న 15 ఏళ్ళ వయసున్న విద్యార్ధి తన తోటి విద్యార్దులపై సెమీ ఆటోమేటిక్ గన్‌తో 15-20 రౌండ్స్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పులలో 14,17 ఏళ్ళు వయసున్న ఇద్దరు విద్యార్ధినులు, 16 ఏళ్లున్న ఓ విద్యార్ధి చనిపోయాడు. ఒక ఉపాద్యాయురాలితో సహా 8 మంది విద్యార్దులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు వారికి శస్త్ర చికిత్స చేశారు. మిగిలిన ఆరుగురు విద్యార్దుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ కాల్పుల ఘటన స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12.51 గంటలకు జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పాఠశాలలో మిగిలిన విద్యార్దులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించి, కాల్పులు జరిపిన విద్యార్ధిని చుట్టుముట్టారు. వారి హెచ్చరికలతో అతను తుపాకి పడేసి పోలీసులకు లొంగిపోయాడు. తోటి విద్యార్దులపై కాల్పులు జరపడానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది.

ఈ 2021 సంవత్సరంలోనే అమెరికా స్కూల్స్‌లో ఇటువంటి కాల్పుల ఘటనలు 138 జరిగాయి. కరోనా కారణంగా స్కూల్స్ మూతపడి తెరుచుకొన్న తరువాతే ఇటువంటి ఘటనలు పెరిగాయని అధికారులు తెలిపారు. కనుక స్కూల్స్ మూసివేత ప్రభావం విద్యార్దులపై ఉందని స్పష్టం అవుతోంది. భారత్‌తో సహా చాలా దేశాలలో ప్రజలు తమ జీవితకాలంలో తుపాకిని చూసే, తాకే అవకాశం కూడా ఉండదు. కానీ అమెరికాలో 15 ఏళ్ళ విద్యార్దులకు కూడా సెమీ ఆటోమేటిక్ గన్‌లు అందుబాటులో ఉండటమే చాలా విడ్డూరం. ఇదే అసలు కారణంగా కనిపిస్తోంది. ఇది స్వయంకృతాపరాధమే కనుక అమెరికా దీనికి  తరచూ ఈవిదంగా మూల్యం చెల్లించుకొంటూనే ఉంది.

Related Post