అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జిగా రూపరంగా నామినేషన్

April 02, 2021
img

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన ప్రభుత్వంలో భారత సంతతికి చెందినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. జో బైడెన్‌ ప్రభుత్వంలో ఇప్పటికే సుమారు 14 మంది భారత సంతతికి చెందినవారికి కీలకపదవులు లభించగా ఇప్పుడు రూపరంగా పుట్టగుంట అనే ఇండో-అమెరికన్‌ మహిళకు ప్రతిష్టాత్మకమైన ఫెడరల్ జడ్జి పదవికి నామినేట్ చేస్తునట్లు జో బైడెన్‌ గురువారం ప్రకటించారు. అమెరికాలోని ఫెడర్ల్‌ సర్క్యూట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జిలుగా మొత్తం 10మందిని జో బైడెన్‌ నామినేట్ చేయగా వారిలో రూపరంగా పుట్టగుంట ఒకరు. ఒకవేళ ఆమె నియామకం ఖాయమైతే దేశ రాజధాని వాషింగ్‌టన్ డీసీ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ పదవి చేపట్టిన మొట్టమొదటి ఏసియన్-అమెరికన్‌ మరియు పసిఫిక్ ఐల్యాండర్‌ (ఏఏపిఐ)గా ఆమె నిలుస్తారు.    

“అమెరికా న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించాలనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆలోచనలకు అనుగుణంగా అత్యంత ప్రతిభావంతులైన వీరిని ఎంపిక చేయడం జరిగింది,“ అని వైట్‌హౌస్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. 

అమెరికాలోనే పుట్టి పెరిగిన రూపరంగా పుట్టగుంట 2002లో న్యూయార్క్ నగరంలోని వస్సార్ కాలేజీలో బీఏ డిగ్రీ చేశారు. తరువాత 2007లో ఒహియో స్టేట్ యూనివర్సిటీ మోర్టిజ్ కాలేజ్ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో జ్యూరిస్ డాక్టర్ డిగ్రీ చేశారు. 2008 నుంచి 2010 వరకు వాషింగ్‌టన్ డీసీ సుపీరియర్ కోర్టులో జస్టిస్ విలియం ఎం.జాక్‌సన్ వద్ద లా క్లర్క్ గా పనిచేశారు. 2013-2019 మద్య కాలంలో ఆమె అదే కోర్టులో సొంతంగా న్యాయవాదిగా చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు ఆమె డీసీ రెంటల్ హౌసింగ్ కమీషన్‌కు అడ్మినిస్ట్రేటివ్ జడ్జీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ఫెడరల్ జడ్జి పదవికి నామినేట్ అయ్యారు. రూపరంగా పుట్టగుంట భారత్‌ మూలాలకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Related Post