అమెరికాలో ప్రవాస భారతీయులు నిరసనలు!

March 19, 2021
img

అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల పట్ల అక్కడి ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉంది. వారిలో చాలామంది మేధావులు, వివిద రంగాలలో నిపుణులలై ఉండటం ఓ కారణమైతే, కష్టపడి పనిచేసే గుణం, వివాదాలకు దూరంగా ఉంటారనే ఓ సదాభిప్రాయం కూడా ఉంది. అందుకే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రవాస భారతీయులకు సముచిత గౌరవం ఇస్తూనే ఉంటుంది. ఈవిషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరింత సానుకూలంగా ఉంటారని అందరికీ తెలుసు. సుమారు 15 మందికిపైగా భారత సంతతికి చెందినవారికి తన ప్రభుత్వంలో కీలక పదవీ బాధ్యతలు అప్పగించడమే అందుకు నిదర్శనం. 

జో బైడెన్‌ అధ్యక్ష పదవి చేపట్టగానే హెచ్-1బీ వీసాలపై గతంలో ట్రంప్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయడమే కాకుండా గ్రీన్‌ కార్డ్స్ మంజూరు ప్రక్రియను కూడా సులభతరం చేస్తున్నారు. కానీ గ్రీన్‌ కార్డ్స్ మంజూరుకు దేశాలవారీగా విధించిన కోటా (క్యాప్), వాటి మంజూరులో జరుగుతున్న ఆలస్యం గురించి జో బైడెన్‌ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రవాస భారతీయులు వాషింగ్‌టన్‌ నగరంలో క్యాపిటల్ హిల్స్ భవనం వద్ద నిరసనలు తెలియజేశారు. గ్రీన్‌ కార్డ్స్ మంజూరుకు అనుసరిస్తున్న ప్రస్తుత విధానాలను సమూలంగా మార్చి వీలైనంత త్వరగా అందేలా చేయాలని వారు జో బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్‌ కార్డ్స్ మంజూరులో జరుగుతున్న ఆలస్యం వలన తాము చాలా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Post