నేటి నుంచి హెచ్-1బీ వీసాల రిజిస్ట్రేషన్లు షురూ

March 10, 2021
img

హెచ్-1బీ వీసాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. అక్టోబర్ 2021- సెప్టెంబర్ 2022 ఆర్ధిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ నెల 25వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్‌) తెలియజేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా కంప్యూటర్ లాటరీ ద్వారానే అభ్యర్ధులను ఎంపిక చేస్తామని తెలిపింది. ఈ నెలాఖరున లాటరీలో ఎంపికైన అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. ఆ తరువాత వారు ఏప్రిల్ 1వ తేదీ నుంచి హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. దీనికి సంబందించిన మార్గదర్శకాలను యూఎస్‌సీఐఎస్‌ విడుదల చేసింది.  

• ముందుగా అభ్యర్ధులు యూఎస్‌సీఐఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అకౌంట్ ఏర్పాటుచేసుకోవాలి. దాని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

• దీని కోసం 10 డాలర్లను రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 

• రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే అభ్యర్ధులు అమెరికాలో తాము చేయబోయేపని, ఉద్యోగం ఇస్తున్న సంస్థ వివరాలను తప్పనిసరిగా తెలియజేయవలసి ఉంటుంది. 

• లాటరీ పద్దతిలో ఎంపికైన అభ్యర్ధులు మాత్రమే హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్స్ వేసేందుకు అర్హులు. 

ఇప్పుడు వీసాలు పొందినవారు వచ్చే ఏడాది అక్టోబర్ 1 తరువాత అమెరికాకు వెళ్ళి వారు పేర్కొన్న కంపెనీలలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఏటా అమెరికా ప్రభుత్వం కొత్తగా 80,000 హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుంటుంది. వాటి కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి లక్షలాదిమంది దరఖాస్తు చేసుకొంటుంటారు. 

గత ఏడాది ట్రంప్‌ హయాంలో హెచ్-1బీ వీసాల జారీపై తీవ్ర ఆంక్షలు విధించినప్పటికీ 2.27 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇప్పుడు జో బైడెన్‌ ప్రభుత్వం ఆ ఆంక్షలన్నీ తొలగించి వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేస్తునందున ఈసారి చాలా భారీగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. 

Related Post