జో బైడెన్‌ పగ్గాలు చేపట్టాక తొలి వైమానిక దాడులు

February 27, 2021
img

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా గురువారం అమెరికా యుద్ధవిమానాలు ఇరాన్‌-సిరియా సరిహద్దు ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ దాడులలో ఇరాన్‌ మద్దతు ఇస్తున్న మిలిషియా ఉగ్రవాదుల స్థావరాలతో పాటు 17 మంది మిలిటెంట్లు మరణించినట్లు పెంటాగన్ ప్రతినిధి జాన్ కిర్బీ ప్రకటించారు. అమెరికన్లు, అమెరికన్ సిబ్బంది రక్షణ కొరకు అమెరికా ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోదని దీంతో స్పష్టం చేశామని జాన్ కిర్బీ అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరాన్‌ను గట్టిగా హెచ్చరిస్తూ, “ఇరాన్‌ ప్రభుత్వం ఏమాత్రం భయంలేన్నట్లు నటిస్తోందనే సంగతి మాకు తెలుసు కానీ అందుకు ఇరాన్‌ మూల్యం చెల్లించవలసి వస్తుందని మరిచిపోరాదు,” అని అన్నారు.  

అమెరికా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినప్పటికీ ప్రపంచశాంతి గురించి తప్పక మాట్లాడుతారు. కానీ శాంతి కోసం నిత్యం ఏదో ఓ దేశంలో ఈవిధంగా యుద్ధాలు కొనసాగిస్తూనే ఉంటారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కాక మునుపు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌, సౌదీ అరేబియా తదితర దేశాల కోసం తమ సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి?అమెరికా పౌరులు చెల్లించిన పన్నులతో ఇతర దేశాలలో శాంతి నెలకొల్పవలసిన అవసరం మాకేమిటి? అని ప్రశ్నించారు. కానీ ఆయన కూడా ఇరాన్, ఇరాక్, సిరియాలతో చివరివరకు యుద్ధం కొనసాగించారు. ఇప్పుడు జో బైడెన్‌ కూడా అదే చేస్తున్నారని చెప్పవచ్చు. కాకపోతే జో బైడెన్‌ అమెరికా పగ్గాలు చేపట్టిన 36 రోజులకే శాంతి కోసం యుద్ధం ప్రారంభించేశారు అంతే!

Related Post