అమెరికాలోని ప్రవాస భారతీయులకు శుభవార్త

February 20, 2021
img

అమెరికాలోని ప్రవాస భారతీయులకు ఓ శుభవార్త. జో బైడెన్‌ ప్రభుత్వం హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఆంక్షలు ఎత్తివేసి, అమెరికాలో స్థిరపడినవారందరికీ గ్రీన్‌ కార్డ్స్ మంజూరు చేసేందుకు వీలుకల్పిస్తూ అమెరికా పౌరసత్వ బిల్లు-2021ని గురువారం కాంగ్రెస్‌ (అమెరికా పార్లమెంటు)లో ప్రవేశపెట్టారు. దానికి కాంగ్రెస్‌ ఉభయసభలు ఆమోదం తెలిపిన తరువాత జో బైడెన్‌ సంతకం చేస్తే అది చట్టరూపం దాలుస్తుంది. అయితే ఎగువసభ అయిన సెనేట్‌లో డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు చెరో 50మంది సభ్యులున్నందున, ఈ బిల్లు ఆమోదానికి కనీసం 10 మంది రిపబ్లికన్ సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. వారి మద్దతు లభిస్తుందని జో బైడెన్‌ ప్రభుత్వం గట్టిగా భావిస్తునందునే ఈ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. 

ఈ బిల్లులో కొన్ని ముఖ్యాంశాలు: 

గ్రీన్‌ కార్డు మంజూరుకు 7 శాతం దేశాల కోటాను ఎత్తివేయబడుతుంది. మొదట దరఖాస్తు చేసుకొన్నవారికి మొదట ప్రాతిపదికన గ్రీన్‌ కార్డు మంజూరు చేయబడుతుంది. కనుక ఇప్పటికే గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్నవారందరికీ త్వరలోనే వరుసగా అవి మంజూరయ్యే అవకాశాలున్నాయి. 

అమెరికాలో చట్టబద్దంగా నివశిస్తున్నవారితో పాటు అక్రమంగా వచ్చి స్థిరపడినవారికి కూడా గ్రీన్‌ కార్డు మంజూరు చేసేందుకు దీనిలో వీలుకల్పించారు. 

అమెరికాలో స్థిరపడిన విదేశీయుల పిల్లలు అమెరికాలోనే పెరిగి పెద్దవారైనప్పటికీ వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వరాదని గతంలో ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జో బైడెన్‌ ప్రభుత్వం దానిని ఎత్తివేసి పిల్లలు ఏ దేశంలో పుట్టిన్నప్పటికీ ఇక్కడ తల్లితండ్రుల దగ్గర ఉంటూ అమెరికాలో పెరిగిపెద్దవారైతే వారికి కూడా అమెరికా పౌరులుగా పరిగణించి అన్ని హక్కులు కల్పించబడతాయి. 

హెచ్-1బీ వీసాలతో అమెరికాకు వచ్చిన వ్యక్తుల జీవితభాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకొనేందుకు మళ్ళీ వెసులుబాటు కల్పించబడుతుంది. 

Related Post