పాపం మయన్మార్... మళ్ళీ మిలట్రీ చేతిలోకి

February 02, 2021
img

బర్మాగా మనం పిలుచుకొనే మన పొరుగుదేశం మయన్మార్ మళ్ళీ సైన్యం చేతిలోకి వెళ్లిపోయింది. నిజానికి 1948, జనవరి 4న ఆ దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఈ 73 ఏళ్ళలో తొలి 14 ఏళ్ళు మాత్రమే ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగింది. ఆ తరువాత నుంచి నేటి వరకు దాదాపు మిలట్రీ పాలనే సాగింది. 

నవంబర్‌ 2020లో జరిగిన ఎన్నికలలో ఆంగ్‌ సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారం రుచి మరిగిన మయన్మార్ మిలట్రీ ఆ ఎన్నికలను అంగీకరించలేమని చెపుతూ సోమవారం సైనిక తిరుగుబాటు చేసింది. 

మిలటరీ కమాండర్-ఇన్‌-చీఫ్ ఆంగ్ హల్యాంగ్ ప్రభుత్వాన్ని తన అధీనంలో తీసుకొన్నట్లు ప్రకటించారు. ఆంగ్‌ సాన్ సూకీని గృహనిర్బందంలో ఉంచుతున్నట్లు మిలటరీ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఏడాదిపాటు అత్యవసర పరిస్థితులు (ఎమర్జన్సీ)ని విధిస్తున్నట్లు ప్రకటించింది. 

మయన్మార్‌లో మిలటరీ తిరుగుబాటును, మిలటరీ పాలనను అమెరికా, బ్రిటన్ దేశాలతో సహా ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. భారత్‌, చైనాలు మాత్రం మయన్మార్‌లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామంటూ చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మయన్మార్ సైనిక ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. తక్షణం ఆంగ్‌ సాన్ సూకీని గృహనిర్బందంలో నుంచి విడుదల చేసి ఆమెకు ప్రభుత్వ పగ్గాలు అప్పగించి మిలట్రీ తప్పుకోవాలని కోరారు. కానీ మిలటరీ పాలకులకు వెనక్కు తగ్గే ఉద్దేశ్యంలో లేరని గ్రహించిన జో బైడెన్‌, మయన్మార్ దేశంపై మళ్ళీ ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితితో చర్చలు ప్రారంభించారు.

Related Post