అమెరికా అధ్యక్షుడి నోట పలికేదీ మనవాడి పలుకులే

January 21, 2021
img

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలో 13మంది భారత సంతతికి చెందినవారున్నారు. వారిలో చోలేటి వినయ్ రెడ్డి కూడా ఒకరు. అతను అధ్యక్షుడి ప్రసంగాలు వ్రాస్తుంటారు. ఆ ప్రసంగాలు వ్రాసే బృందానికి అతనే హెడ్. విశేషమేమిటంటే వినయ్ రెడ్డి మన తెలంగాణ బిడ్డడు. అతని తండ్రి నారాయణ రెడ్డి స్వస్థలం హుజూరాబాద్‌లోని పోతిరెడ్డిపేట గ్రామం. నేటికీ వారి కుటుంబానికి అక్కడ 3ఎకరాల వ్యవసాయ భూమి, సొంత ఇల్లు కూడా ఉన్నాయి. నారాయణ రెడ్డి హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన తరువాత 1970లో అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారులలో ఒకడైన వినయ్ రెడ్డి అక్కడే పుట్టి పెరిగాడు. డేటన్, ఒహియోలలో విద్యాభ్యాసం ముగించుకొన్న తరువాత ఓహియో స్టేట్ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. వినయ్ రెడ్డి తెలంగాణ గడ్డపై పుట్టనప్పటికీ అతనికి తెలంగాణ అంటే ఎనలేని మమకారం. చిన్నప్పుడు రెండు మూడు సార్లు తల్లితండ్రులతో కలిసి హుజూరాబాద్ వచ్చి వెళ్ళాడు. 

వినయ్ రెడ్డి తను చదివిన న్యాయవాద వృత్తిలో ప్రవేశించేబదులు ప్రసంగాలు వ్రాసే పనిని వృత్తిగా ఎంచుకొని రాణించడం విశేషమే. అతను మొదట యూఎస్. పర్యావరణ పరిరక్షణ సంస్థ, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సైన్సస్‌లలోని ఉన్నతాధికారులకు ప్రసంగాలు వ్రాసేవారు. ఆ తరువాత అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్‌కు ప్రసంగాలు వ్రాయడం మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి గెలిచిన కమలా హారిస్‌కు కూడా వినయ్ రెడ్డి అనువాదకుడిగా పనిచేశారు. ప్రెసిడెన్షియల్ చీఫ్ స్పీచ్ రైటర్‌గా ఎంపికైన మొట్టమొదటి ఇండో-అమెరికన్ మన వినయ్ రెడ్డే. అంటే మన తెలంగాణ బిడ్డడు వ్రాసిన ప్రసంగాలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నోట వెలువడుతున్నాయన్న మాట! ఇది మనందరికీ గర్వకారణమే కదా?

Related Post